CPI formation day: భారత కమ్యూనిస్ట్ పార్టీ 97వ వ్యవస్థాపక దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా.. పార్టీ నేతలు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు.
విజయవాడలో పార్టీ వ్యవస్థాపక సంబరాలు..
రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిపాలన కొనసాగుతోందని.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. విజయవాడలోని పార్టీ కార్యాలయమైన దాసరి భవన్ వద్ద పతాకావిష్కరణ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు. డమ్మీలు మాత్రమే మంత్రులుగా ఉన్నారని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నా.. వారెవరికీ సొంత అభిప్రాయలు లేవని రామకృష్ణ మండిపడ్డారు. వారి శాఖల్లో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదన్నారు.
ఏ ఒక్క రాజకీయ పార్టీ అర్జీలు తీసుకోలేని ప్రభుత్వం.. రాష్ట్రంలో ఉండడం ప్రజల దౌర్భాగ్యమన్నారు. సీపీఐ.. స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు చేసిందని, భవిష్యత్ లో ప్రజలకు అండగా ఉంటూ మరిన్ని ఉద్యమాలు చేస్తుందన్నారు.
తిరుపతిలో..
మద్యం, సినిమా టికెట్లపై ధరలు తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్, డీజిల్ పై ఎందుకు తగ్గించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. సీపీఐ 97వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా.. తిరుపతిలోని పార్టీ కార్యాలయంలో అరుణ పతాకం ఎగరవేశారు. సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ ప్రమేయం ఉండాలి కానీ.. కక్షపూరిత కుట్ర ఉండకూడదన్నారు.
గుంటూరులో..
సీపీఐ 97వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. గుంటూరు మున్సిపల్ కార్యాలయం నుంచి సీపీఐ జిల్లా పార్టీ కార్యాలయం వరకు పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టారు. పెట్టుబడి దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సీపీఐ ఆవిర్భవించిందని.. రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ తమదని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం నిరంకుశ విధానాలు అవలంభిస్తోందని.. సీపీఐ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
అనంతపురంలో..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. రాయదుర్గం తాలూకా సీపీఐ కార్యదర్శి ఎమ్.నాగార్జున పార్టీ జెండాను ఆవిష్కరించి, కేకు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి.. నిరంతరం పేద, మధ్య తరగతి కార్మికులు, రైతుల కోసం నిరంతరం పోరాటాలు చేసి పార్టీ పయనిస్తుందన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్.. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ చార్జీలు పెంచుతూ.. సామాన్య, మధ్యతరగతి పేద ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో.. నిరంతరం ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేస్తూ, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని నాగార్జున అన్నారు.
ఇదీ చదవండి:
Attempted burglary at former CP home : మాజీ సీపీ ఇంట్లో చోరీకి యత్నం...కత్తులతో బెదిరింపు...ఆపై..