రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మక తప్పిదమని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి (tulasi reddy) ధ్వజమెత్తారు. వికేంద్రీకరణ, నిధుల కొరత, వరద ముప్పు, ఒకే సామజిక వర్గం, ఇన్ సైడర్ ట్రేడింగ్, ఇవి రాజధాని తరలింపునకు.. అసంబద్ధ ఆరోపణలని తేలిపోయిందని విమర్శించారు.
అమరావతి ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుంటే నిధుల కొరత ఉండేది కాదని తెలిపారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని సుప్రీంకోర్టు తెలిపిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాజధాని తరలింపు విషయాన్ని విరమించుకోవాలని.. తులసి రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తానని.. అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక యువతను నమ్మించి మోసగించడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో దాదాపు 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఉద్యోగా ఖాళీలున్నాయని, అందులో 10.143 ఉద్యోగాలు మాత్రమే జాబ్ క్యాలెండర్లో విడుదల చెయ్యడం అన్యాయమన్నారు. మిగిలిన ఖాళీలను కూడా భర్తీ చేస్తూ అదనపు జాబ్ క్యాలెండర్ను విడుదల చెయ్యాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తీసుకురావాలని, స్వయం ఉపాధి పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
telangana: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం, ఏడుగురు మృతి