గత మార్చిలో జరిగిన పరీక్షలకు వివిధ కారణాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 27 వేల మంది రెండో సంవత్సర విద్యార్థులు హాజరుకాలేదు. ఇపుడు వారంతా సప్లిమెంటరీ నిర్వహించకపోతే విద్యా సంవత్సరం వృథా అవుతుందన్న ఆందోళనలో ఉన్నారు. తమను ఉత్తీర్ణులను చేయాలని, లేకుంటే పరీక్షలు జరపాలని కోరుతూ ఇటీవల కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత మార్చి పరీక్షలలో ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులు 1,92,172 మంది తప్పారు. ఇంటర్‌బోర్డు ఇప్పటికే 2021 మార్చి 24 నుంచి వార్షిక పరీక్షలు జరుపుతామని స్పష్టం చేసింది. అంటే వాటికి కనీసం నెల ముందుగా సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యేలా చూడాలి. ఆరోగ్య శాఖ హెచ్చరికల నేపథ్యంలో డిసెంబరులోపు సప్లిమెంటరీ నిర్వహించే అవకాశమైతే లేదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు.
వెయిటేజీ ఉంటే ఎలా?
ఎంసెట్‌లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ప్రధాన సబ్జెక్టుల్లోని 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు లెక్కిస్తారు. వెయిటేజీ ఎత్తివేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఇటీవల వెల్లడించినా అది కార్యరూపం దాలుస్తుందా.. అన్నది చూడాలి.
వెయిటేజీ ఉన్నందునే ఏటా ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు దాదాపు లక్షన్నర మంది బెటర్‌మెంట్ కోసం పరీక్షలు రాస్తుంటారు. ఒకవేళ వచ్చే ఏడాది కూడా వెయిటేజీ కొనసాగితే బెటర్‌మెంట్ నిర్వహించకుండా దాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించే అవకాశం ఉంది. చివరకు న్యాయపరమైన సమస్యలూ రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: కాలుష్య కాసారంగా దిల్లీ- మోగుతున్న ప్రమాద ఘంటికలు