Condolence to Rosaiah: మాజీ ముఖ్య మంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. రోశయ్య, తాను ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు అనుబంధం ఏర్పడిందని చెప్పారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపుతున్నానని మోదీ చెప్పారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ.. రోశయ్య పరమపదించారని తెలిసి ఎంతో విచారించానని అన్నారు. ప్రజానేత ఎన్జీ రంగా శిష్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన రోశయ్య.. తనకు చిరకాల మిత్రుడని అన్నారు.
రోశయ్య భౌతికకాయానికి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నివాళులు అర్పించారు. రోశయ్య మరణం తెలుగుప్రజలకు తీరని ఆవేదన కలిగిస్తోందని అన్నారు. కార్యకర్త స్థాయి నుంచి సీఎం, గవర్నర్ స్థాయికి రోశయ్య ఎదిగారని సీజేఐ అన్నారు. కళలు, సంస్కృతికి పెద్దపీట వేశారని కొనియాడారు.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ సైతం రోశయ్య మృతిపట్ల సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడు శివసుబ్బారావును ఫోన్‌లో సోనియా, రాహుల్ పరామర్శించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.
రోశయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోశయ్య సేవలను కొనియాడిన ముఖ్యమంత్రి.. ఆయన మరణం కలచివేసిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం విచారం వ్యక్తం చేశారు. అమీర్‌పేట్‌లోని నివాసంలో రోశయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
రోశయ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాని చంద్రబాబు అన్నారు. పదవులకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి రోశయ్య అని కొనియాడిన చంద్రబాబు.. రికార్డు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితో మెలిగిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. రోశయ్య భౌతికకాయానికి నివాళి అర్పించిన బాబు.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం నివాళులు అర్పించారు. అసెంబ్లీలో రోశయ్య ఎంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: Condolence to Rosaiah: అజాత శత్రువు అస్తమయం.. ప్రముఖుల సంతాపం