ఆదాయాన్ని తీసుకొచ్చే ప్రభుత్వ శాఖల పనితీరును ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, రవాణా, భూగర్భ గనులు, అటవీ తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. వన్ టైం సెటిల్‌మెంట్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టిడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం.. ఎలాంటి సేవలు పొందవచ్చనే అంశాలపై సిబ్బంది, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం చర్చించారు. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పత్రాలతో రిజిస్ట్రేషన్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబరు 2నాటికి తొలివిడత కింద రిజిస్ట్రేషన్ సేవలు, భూహక్కు–భూరక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు.
గనుల శాఖలో మినరల్స్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని అధికారులు తెలపగా.. వీటిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటే ఆదాయం పెరుగుతుందని సీఎం సూచించారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు సీఎంకు తెలిపారు. జెన్‌కో సహా రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూడాలని.. దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. బొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడటంపై కార్యాచరణ రూపొందించి తనకు నివేదించాలని సూచించారు. బొగ్గు గనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
వాణిజ్య పన్నుల శాఖను పునర్ నిర్మించాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఉండాలని సూచించారు. జూన్ కల్లా డేటా అనలిటిక్స్ విభాగం, లీగల్‌సెల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం తీసుకురావాలన్నారు. వీలైనంత ఎక్కువగా బకాయిలు వసూలు చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నిర్దేశించారు. అబ్కారీ శాఖపై చర్చించిన సీఎం.. అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వీలైనన్ని చర్యలు తీసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచాలని అన్ని శాఖల అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
ఇవీ చూడండి