Bankers meeting: ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు అవసరమైన చర్యలను బ్యాంకులు తీసుకోవాలని, తక్కువ వడ్డీకి విరివిగా రుణాలివ్వాలని ముఖ్యమంత్రి జగన్ బ్యాంకర్లకు సూచించారు. ‘పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఘర్షణలతో ముడిచమురు, బొగ్గు ధరల పెరుగుదల తదితర పరిణామాలతో సరకుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇది దిగువ తరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తయారీ రంగంపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. సరకులు కొనేవారు లేకపోతే వారు పరిశ్రమల్ని మూసివేసే పరిస్థితి వస్తుంది. వీటన్నింటినీ బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలి’ అని చెప్పారు.
గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) 219వ సమావేశంలో రూ.3.19 లక్షల కోట్లతో 2022-23 వార్షిక రుణ ప్రణాళికను సీఎం విడుదల చేశారు. ‘2021-22లో వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19% చేరడం అభినందనీయం. కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు బాగున్నా.. విద్య, గృహనిర్మాణం, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు రుణాల మంజూరులో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి’ అని ఈ సందర్భంగా సూచించారు. ‘గతేడాది ఖరీఫ్‌లో వ్యవసాయకాలిక రుణాలు (టర్మ్‌లోన్లు) 59.88% మాత్రమే ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణ లక్ష్యంలో 82.09%, కోళ్ల పరిశ్రమకు 60.26% రుణాలే ఇచ్చారు.
ఎంఎస్‌ఎంఈలకు లక్ష్యంలో 90.55% మాత్రమే రుణాలందాయి. ఈ రంగాలకు రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని కోరారు. ‘బ్యాంకుల్లో పొదుపు సంఘాల మహిళల కార్పస్‌ఫండ్‌పై 4% వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నారు. వారు తీసుకునే రుణాలపై మాత్రం అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని మహిళలు చెబుతున్నారు. ఈ అంశంపై దృష్టి సారించి వడ్డీ భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి’ అని బ్యాంకర్లను సీఎం కోరారు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోకూడదని, దీనిపై కేంద్రమే మార్గదర్శకాలు జారీ చేసిందని సీఎం ప్రస్తావించారు.
"తక్కవ వడ్డీలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలి. ఎగుమతులు, విద్యా రంగం, హౌసింగ్ రుణాలు పెరగాలి. సాగు యాంత్రీకరణ, పౌల్ట్రీ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలి. ఎంఎస్‌ఎంఈ రుణాలపై బ్యాంకులు దృష్టిపెట్టాలి. గృహాలపై పేదలకు రుణాలిచ్చి అండగా నిలవాలి. మహిళలకు బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాలి. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు బ్యాంకులు సహకరించాలి. డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలి. హార్బర్లు, పోర్టుల నిర్మాణాలకు బ్యాంకులు సహకరించాలి." -జగన్, సీఎం
జులైలో జగనన్నతోడు రుణాలు.. చిరువ్యాపారులు, సంప్రదాయ హస్త కళాకారులకు జగనన్న తోడు కింద రెండో విడత రుణాలను జులైలో ఇచ్చేందుకు కార్యాచరణ తయారుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ‘ఈ పథకం కింద 14.15 లక్షల మందికి బ్యాంకులు రుణాలిచ్చాయి. ఇదే ధోరణి కొనసాగించాలి’ అని సూచించారు. ‘కౌలు రైతులకు నిర్దేశిత లక్ష్యంలో 42.53% మాత్రమే రుణాలిచ్చారు. వీరికి రుణాలందించడంపై బ్యాంకర్లు శ్రద్ధ పెట్టాలి. ఈ-క్రాప్ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని విరివిగా రుణాలివ్వాలి. ఆర్‌బీకే, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కూడా కౌలు రైతులకు సహకరించాలి’ అని సీఎం సూచించారు. డ్రోన్ సాంకేతికతకు బ్యాంకర్ల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి