శ్రీశైలం రిజర్వాయర్‌పై ఏపీలోని 8 జిల్లాలకు పైగా ఆధారపడి ఉన్నాయని.. భౌగౌళికంగా ఎక్కువ విస్తృతి కలిగిన ప్రాంతం నీటిని వినియోగిస్తున్న కీలకమైన భాగస్వామిగా ఏపీకే వీటిపై అజమాయిషీ ఉండేలా చూడాలని, లేదా ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్ కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ఏపీకి రావాల్సిన నీటి వాటాలపై అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు లేఖ రూపంలో వివరాలు సమర్పించారు. తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం ప్రాజెక్టు నీరు ఒక్కటే ఆధారమని.. అందుకే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం తప్పనిసరి అని పేర్కొన్నారు.
థార్ ఎడారి తర్వాత దేశంలోనే అతితక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా అనంతపురం ఉందని.. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు కూడా దుర్భిక్ష ప్రాంతాల అభివృద్ధి పథకంలో భాగమై ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. వలసలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే నీరు అత్యంత కీలకమైన వనరు అని ప్రభుత్వాలు గుర్తించాలని జగన్ అన్నారు. తెలంగాణాలోని మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి కేటాయింపులు 142, 104 టీఎంసీల చొప్పున ఉంటే.. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం జిల్లాకు 50 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు.
రాయలసీమలోని 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కనీసంగా 600 టీఎంసీల నీటిని అందించాల్సి ఉంది. గత ఏడాది జూన్ 28 తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవే అంశాలపై అంగీకారాన్ని తెలిపారు. శ్రీశైలంలో 854 అడుగుల కంటే ఎక్కువ నీటి నిల్వ ఉన్నప్పుడే 7 వేల క్యూసెక్కుల చొప్పున పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించగలిగాం. పునర్విభజన చట్టంలో భాగంగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ను ఏపీకి తరలించాలి.
- సీఎం జగన్మోహన్ రెడ్డి