తిరుపతి ఉపఎన్నికలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి బూత్‌లోనూ 300 నుంచి 400 దొంగ ఓట్లు వేసుకున్నారని కాంగ్రెస్ నేత చింతా మోహన్ విమర్శించారు. ఒక్క తిరుపతిలోనే 70 వేల దొంగ ఓట్లు వేశారని దుయ్యబట్టారు. తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీకాళహస్తి, గూడూరు, సూళ్లూరుపేటలో 50 వేల చొప్పున దొంగ ఓట్లు వేశారని మండిపడ్డారు. ఎన్నిక జరగడానికి ముందు రోజు రాత్రి పోలింగ్ అధికారికి రూ.20వేలు, కానిస్టేబుల్‌కు రూ.10వేలు, ప్రతి వాలంటీరుకు ముక్కు పుడక లేదా రూ.5వేలు ఇచ్చినట్లు ఆరోపించారు.
తిరుపతి ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఉద్దేశంతో భాజపా మద్దతుతోనే వైకాపా నాయకులు ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. తిరుపతిలో జరిగిన ఈ వ్యవహారాన్ని ముఖ్యమైన జాతీయ నేతల దృష్టికి తీసుకువెళతామని చింతా మోహన్ అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిద్రపోతున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషన్ విధి విధానాలను మారుస్తామని చెప్పారు. పదవీవిరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఈసీగానూ, పదవి విరమణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎస్‌ఈసీగానూ నియమించేలా చట్టంలో మార్పులు చేస్తామన్నారు.
ఎన్నికల్లో ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పత్రాలు వినియోగించాలని డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల్లో వైకాపాకు 151 సీట్లు, 22 ఎంపీ స్థానాలు ఎలక్టోరల్ మోసంతోనే వచ్చాయని.. జగన్ పాదయాత్ర, ఒక్క ఛాన్స్ అన్న నినాదం వల్ల రాలేదన్నారు. మోదీ, అమిత్‌షా సహకారంతోనే అవి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 303 లోక్‌సభ సీట్లు రావడం కూడా మోసమేనన్నారు. ఎన్నికల కమిషన్, ఈవీఎంలను తయారు చేసిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్), సీఆర్‌పీఎఫ్‌లు కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని చింతా మోహన్ దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: ఆస్పత్రుల్లో హృదయ విదారక దృశ్యాలు..బరువెక్కుతున్న గుండెలు