రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన సహా.. వివిధ అంశాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో.. పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. వైకాపా సర్కార్ చెప్పేదానికి, ఆచరిస్తున్నదానికి పొంతన లేదన్నారు. అనేక ఆంక్షలతో... సంక్షేమానికి కోతలు పెట్టడమేగాక అందులోనూ వైకాపా నేతలే.. స్వాహా చేస్తున్నారని... దుయ్యబట్టారు. ఇళ్ల స్థలాలిస్తామంటూ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు.
నాసిరకం మద్యం.. ధరలను విచ్చలవిడిగా పెంచడంతో మందుబాబులు స్పిరిట్ తాగే పరిస్థితికి వెళ్లారని చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జగన్ మోసకారి అని.. వైకాపా నాయకులే చెప్తున్నారని.. ఇసుక అక్రమాలు సహా వివిధ అంశాలపై అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తదితరుల మాటలను గుర్తు చేశారు. ఏడాదిలోనే ఇంత అవినీతికి పాల్పడితే వచ్చే నాలుగేళ్లలో దోపిడీ ఏ స్థాయికి వెళ్తుందో తలచుకుంటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారని.. వ్యాఖ్యానించారు. పీపీఏల సమీక్ష పేరుతో వైకాపా చేసిన నిర్వాకాల వల్లే.. దేశవ్యాప్తంగా విద్యుత్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసే పరిస్థితి.. వచ్చిందన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్‌కి యాజమాన్యానిదే బాధ్యతని జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పష్టం చేసినా..... సీఎం, మంత్రులు ఇంకా సంస్థకు వత్తాసు పలుకుతున్నారని.. చంద్రబాబు మండిపడ్డారు. విధ్వంసానికి ఒక్క ఛాన్స్ వీడియోలతో ప్రజలను చైతన్యపరుస్తున్నామని వెల్లడించారు.
ఇకపై నెలకోసారి పొలిట్ బ్యూరో సమావేశం ఉంటుందన్న చంద్రబాబు... అభ్యర్థులతో 15 రోజులకోసారి, ప్రజాప్రతినిధులు, పార్టీ మండల అధ్యక్షులతో.... నెలకోసారి సమావేశాలు నిర్వహిస్తానని చెప్పారు. 3 నెలలకోసారి.. గ్రామ పార్టీ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి పెండింగ్ కమిటీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లాల వారీ రాజకీయ సమన్వయ కమిటీ నియామకాలు పూర్తి చేస్తానని వెల్లడించారు. ఏడాదిలో.. 800మంది తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు దాడులు చేశారని, అనేకమంది నాయకులపైనా తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రజాసమస్యలపైనా పొలిట్‌బ్యూరోలో చర్చ జరిగింది.
ఇదీ చదవండి: భారత్‌కు సాయం కోసం.. బుజ్జి ఎన్ఆర్ఐ సాహసం