అక్షర గణితంలో అనితర సాధ్యమైన ప్రతిభను కనబర్చి ప్రపంచ రికార్డు నెలకొల్పింది విజయవాడ అమ్మాయి. కేవలం 5.12 నిమిషాల వ్యవధిలో 6,020 రూట్2 డెసిమల్స్ వరకు అనర్గళంగా చెప్పిన తనకు సాటి లేదని... సాయి అక్షర చాటి చెప్పింది. ఆమె ప్రతిభను ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది. ఈ ప్రతిభకు మరెన్నో సంస్థల నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. కేవలం గణితంలోనే కాదు-మరెన్నో అంశాల్లో అబ్బురపరిచే ప్రజ్ఞతో అక్షర బహుముఖంగా రాణిస్తోంది.
సాయి అక్షర ప్రపంచ రికార్డు సాధించింది. గణితంలో రూట్ టూ (రూట్2)కి విలువ 1.414. ఇది అనంతమైంది. ఈ విలువను 6020 డెసిమల్స్ వరకు కేవలం 5.12 నిమిషాల్లో చెప్పి అద్భుత ప్రదర్శనగా అందరి అభినందనలు అందుకుంది వేమూరి సాయి అక్షర. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రపంచ రికార్డును ధ్రువీకరిస్తూ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అత్యంత వేగంతో, అందరి కంటే ఎక్కువ డెసిమల్స్ వరకు చెప్పిన అక్షర, 60.08 నిమిషాల్లో 6,002 డెసిమల్స్‌తో అప్పటివరకు ఉన్న ప్రపంచ రికార్డుని అధిగమించించి విజయవాడ ఘనతను విశ్వ వ్యాపితం చేసింది.
వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో కళ్లు మూసుకుని 5.12 నిమిషాల్లో అనర్గళంగా 6,020 డెసిమల్స్ వరకు చెప్పిన తీరుకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్, బ్రెయిన్ రైమ్ రేడియో తదితర ప్రతిష్టాత్మక సంస్థల పరిశీలకులు సైతం సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తన తల్లిదండ్రులు వేమూరి బుజ్జి, సుజనశ్రీల ప్రోత్సాహం... అడుగడుగునా తనకు స్ఫూర్తినిస్తుండడం వల్ల తాను ఈ స్థాయికి వచ్చానని- రూట్2 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో నిలవడమే తన లక్ష్యమని పేర్కొంటోంది.
బాల్యానికి నడకలు నేర్పితే భవిష్యత్ పరుగులు పెడుతుంది. బుడిబుడి అడుగుల ప్రాయం నుంచే పిల్లల్లో దాగిన ప్రతిభ గుర్తించి సాన బెడితే ఎన్నో అద్భుతాలను సృష్టిస్తారనడానికి ఉదాహరణగా అక్షర నిలుస్తోంది. గణితంతోపాటు శాస్త్ర విజ్ఞానంలోనూ రాణిస్తోంది. కడపలో నిర్వహించిన ఇన్‌స్పైర్ మానక్-2020లో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చూపింది. ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన ఇంటర్నేషనల్ యంగ్ ఇన్నోవేటర్స్-2019లో ప్రదర్శించిన ‘స్మార్ట్ హెల్మెట్ ప్రాజెక్టుకు గుర్తింపు లభించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ-2018లో చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ పోటీల్లోనూ పురస్కారాన్ని దక్కించుకుంది. తన మిత్రులతో కలిసి అక్షర రూపొందించిన పలు ప్రాజెక్టులు జాతీయస్థాయికి సైతం ఎంపిక అయి ఉత్తమంగా నిలిచాయి.
పదోతరగతి చదువుతున్న ఈ చిన్నారి విభిన్న అంశాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుపొందింది. చదువుతో పాటు సేవ, క్రీడలు తదితర రంగాల్లో రాణిస్తోంది. చిన్నప్పటి నుంచి క్రీడలు, క్విజ్, వ్యాసరచన, వివిధ పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ పలు బహుమతులు సాధించింది. కరోనా కారణంగా విద్యా సంవత్సరం అర్ధాంతరంగా నిలిచిపోవడం-పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారనే విషయంలో స్పష్టత లేని సమయంలో లాక్‌డౌన్, అన్‌లాక్ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది.
తన ప్రతిభను తనలోనే దాచుకోకుండా ఇతరులకు పంచే ప్రయత్నంలో సఫలీకృత పొందింది. తన జూనియర్లు అయిన తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించి భళా అనిపించుకుంది. ఆస్ట్రానమీ క్లబ్‌ను ఈ సమయంలోనే స్థాపించి చిన్నారులకు ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని పరిచయం చేస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా సమాజానికి అక్షర ఇస్తోన్న సందేశాలు ఆకట్టుకుంటున్నాయి.
రోటరీ ఇంట్రాక్ట్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్‌కు అధ్యక్షత వహిస్తున్న చిన్నారి అక్షర తన స్నేహితులతో కలిసి విరాళాలు సేకరించి వివిధ ప్రభుత్వ పాఠశాలల్లోని వందలాది మంది విద్యార్థులకు జామెట్రీ బాక్సులను ఉచితంగా అందజేసింది. ఏ పని ప్రారంభించినా.. తర్వాత ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం ఒక్కటే కంటికి కనిపించాలంటూ తల్లిదండ్రులు ఇస్తోన్న స్ఫూర్తిని.. అక్షర ఆచరణ సాధ్యం చేస్తూ పట్టుదలతో అడ్డంకులను అధిగమించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలుస్తోంది.
చదువు ఒక్కటే కాదు.. ఆటపాటల్లోనూ అక్షరకు అనేక అవార్డులున్నాయి. సంగీతంలో కీబోర్డు గ్రేడ్-1, గ్రేడ్-2 విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచింది. ఆర్చరీలోనూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. సమాజానికి తమ వంతు సేవ చేయడంతోపాటు బహిరంగ సభలు, సమావేశాల్లో సేవా ప్రాముఖ్యతపై అనర్గళంగా ఉపన్యాసాలు ఇస్తూ ఆకట్టుకుంటుంది అక్షర.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు