CBN Review with TDP in charges వైకాపా ప్రభుత్వం రాష్ట్రానికి పట్టిన వైరస్ అని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అసత్య ప్రచారమే వైకాపా అస్త్రం అని.. క్షేత్రస్థాయిలో దాన్ని తిప్పికొట్టాలని నేతలకు ఆయన సూచించారు. పార్వతీపురం, రంపచోడవరం, మాడుగుల నియోజవర్గ ఇంఛార్జ్‌లతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. వైకాపా పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలని సూచించారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. వేధింపులు, కబ్జాలు, అక్రమ కేసులు, బాధితుల ఆత్మహత్యలు, కూల్చివేతలు నిత్యకృత్యమయ్యాయని అన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఉపాధి కోల్పోవటం ఒకటైతే.., వైకాపా నేతల దౌర్జన్యాలు, అక్రమాల కారణంగా చాలా మంది జీవితాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధల్లో ఉన్న ప్రజలకు తెదేపా నేతలు, కార్యకర్తలు తమ పోరాటం ద్వారా ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. స్థానిక సమస్యలపై ప్రజలను కూడా కలుపుకుని పోరాటాలు చేయాలన్న చంద్రబాబు.. వారికి నాయకత్వం అందించి సరైన దిశగా నడిపించాలన్నారు. ప్రతి ఇంచార్జ్ నియోజకవర్గంలో నెలలో కనీసం 10 నుంచి 15 రోజులు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. నియోజకవర్గానికి అబ్జర్వర్‌గా ఉన్న నేతలు నెలలో కనీసం 8 రోజులు ఆ నియోజకవర్గంలో పర్యటించాలని తెలిపారు. ప్రతి నేత గ్రామ స్థాయిలో క్యాడర్‌ను కలుపుకుని పర్యటనలు చేయటంతో పాటు కార్యకర్తలకు గౌరవం, ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
ఇవీ చూడండి