HC on capital issue: సీఆర్‌డీఏను రద్దు చేస్తూ, మూడు రాజధానుల చట్టాలను తెచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించలేదని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) హరినాథ్ వెల్లడించారు. అదేవిధంగా ఆ చట్టాలను రద్దు చేస్తూ తాజాగా తీసుకొచ్చిన చట్టం విషయంలోనూ సంప్రదించలేదని పేర్కొన్నారు. పరిపాలన సీటు(సీట్ ఆఫ్ గవర్నెన్స్) ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని తెలిపారు. ఇదే విషయమై కౌంటర్ వేస్తూ వైఖరి తెలిపినట్లు ఆయన స్పష్టం చేశారు. అమరావతి వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ, సీఆర్‌డీఏ, శాసనమండలి కార్యదర్శి, పిటిషనర్ల తరఫు కొంతమంది న్యాయవాదుల వాదనలు వినిపించారు. తదుపరి విచారణను 4కు వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... రాజధాని విషయంలో భాగస్వాములందరితో (స్టేక్‌హోల్డర్స్) మరోసారి సంప్రదింపులు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించి సీఆర్‌డీఏ రద్దు చట్టం, మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసిందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘అంటే పూర్వం సంప్రదింపుల ప్రక్రియ సక్రమంగా జరగలేదనే కదా అర్థం’ అని వ్యాఖ్యానించింది. రాజధాని అమరావతిని మారుస్తూ శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెబుతున్నారు... దానికేం సమాధానం చెబుతారని ప్రశ్నించింది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్లు 5, 6 ప్రకారం శాసనం చేసే అధికారం రాష్ట్రానికి ఉందని ఏజీ చెప్పారు. ‘చట్టసభలు శాసనాలు చేయకుండా న్యాయస్థానాలు నిలువరించలేవు. రాజధానిని మరోచోటికి మార్చకూడదంటూ నిషేధం విధిస్తూ నిబంధనలు ఏమీ లేవు. అమరావతిని మార్చకుండా పిటిషనర్లు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారని.. ఆ విషయాన్ని నిర్ణయించాలంటే ఏపీ విభజన చట్టం నిబంధనలకు అనుగుణంగా రాజధానిని నిర్మించారా లేదా అన్నది తేల్చాలి...’ అని వాదించారు. ‘రాజధాని ఏర్పాటు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదు. మూడు రాజధానుల చట్టం తెచ్చే అధికారం రాష్ట్రానికి లేదు. దానిని రద్దు చేసే అధికారం కూడా లేదు...’ అని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్, పీబీ సురేశ్, ఉన్నం మురళీధరరావు తమ వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి:
AP Capital Issue: ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే.. రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన