BJP Protest: ప్రధానమంత్రి పంజాబ్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను నిరసిస్తూ భాజపా రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్ష చేపట్టింది. పంజాబ్ ప్రభుత్వం నిరంకుశత్వంతో వ్యవహరించిందంటూ.. విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో భాజపా శ్రేణులు నిరసన తెలిపాయి. నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని మౌన దీక్ష చేశారు. ఉగ్రవాదులతో కలిసి కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నిందని ఆరోపిస్తూ... కర్నూలులోని గాంధీ విగ్రహం వద్ద భాజపా నేతలు మౌన దీక్ష నిర్వహించారు. పంజాబ్ ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల విజయనగరం జిల్లాలో భాజపా నేతలు మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటన వెనక కాంగ్రెస్ నేతల పాత్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే..
ఈనెల 5న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నాటకీయ పరిణామాల మధ్య ఫిరోజ్పుర్లో జరగాల్సిన సభ ఆకస్మికంగా రద్దు అయింది. పంజాబ్‌లో మోదీ అడుగుపెట్టినప్పటికీ.. సభకు హాజరు కాకుండానే తిరిగి ఆయన దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఫిరోజ్‌పుర్ జిల్లాలో నిరసనకారులు రహదారిని దిగ్బంధించడం వల్ల.. ప్రధాని, ఆయన వాహనశ్రేణి 15-20 నిమిషాల పాటు పైవంతెనపై చిక్కుకుపోయింది. దీంతో ప్రధాని తన పర్యటనను అర్ధంతరంగా ముగించుకొని దిల్లీకి తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే సభకు మోదీ హాజరు కాలేకపోయారని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే, సభకు జనం రాలేదనే మోదీ సమావేశాన్ని రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది.
రాష్ట్రపతితో మోదీ భేటీ..
ఈ ఘటన తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై మాట్లాడారు. ఈ విషయంపై రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
త్రిసభ్య కమిటీ ఏర్పాటు..
ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇందులో భాగంగా ప్యానెల్.. శుక్రవారమే దర్యాప్తును ప్రారంభించింది. రాష్ట్రంలో పర్యటించిన కమిటీ.. పంజాబ్ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ సహా మొత్తం 10 మందికిపైగా పోలీస్ ఉన్నతాధికారులకు సమన్లు జారీ చేసింది.
సుప్రీంలో విచారణ..
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనకు సంబంధించిన ప్రయాణ వివరాలు, ఏర్పాట్ల సమాచారాన్ని వెంటనే భద్రపరచాలని పంజాబ్-హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించింది సుప్రీం కోర్టు. మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై.. దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది.
దర్యాప్తు కోసం కేంద్రం, పంజాబ్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిటీలు భద్రతా లోపంపై విచారణను సోమవారం వరకు నిలిపివేయాలని కోర్టు స్పష్టం చేసింది. రికార్డులు సేకరించేందుకు దర్యాప్తు సంస్థలు, పోలీసులు సహకరించాలని సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి
'మోదీ టూర్లో భద్రతా వైఫల్యం'పై దర్యాప్తు- కేంద్రం షోకాజ్ నోటీసులు