పదో తరగతి పరీక్షా ఫలితాలపై మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తమ పార్టీ నేత లోకేశ్ ఏర్పాటు చేసిన జూమ్ సమావేశంలోకి వైకాపా వాళ్లు దొంగల్లా చొరబడ్డారని ఆయన మండిపడ్డారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సుల్లోకి వైకాపా వాళ్లు వచ్చారని అన్నారు. మంత్రి బొత్స కాన్ఫరెన్స్ పెడితే.. విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్‌లోనే చీపుర్లతో కొడతారు, ముఖాన ఉమ్మేస్తారని అన్నారు. జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
వైకాపా పాలనలో వ్యవసాయ శాఖకు తాళాలేశారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించారని.., మళ్లీ ఇప్పుడు రైతులు క్రాప్ హాలిడేకు వెళ్లారని విమర్శించారు. ఏం చేశారని 175 స్థానాల్లో ప్రజలు వైకాపాని గెలిపిస్తారని అచ్చెన్న ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయగలరా ? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొత్త ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం.. పాత ప్రాజెక్టులు కొట్టుకుపోతోన్నా కాపాడలేకపోతుందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో వచ్చిన వందల పరిశ్రమలు.. జగన్ హయాంలో రాష్ట్రాన్ని వీడిపోయాయన్నారు. ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినందుకా.. వైకాపాకు ఓట్లేసేదని అచ్చెన్న నిలదీశారు. ఒక్క ఉద్యోగం, ఉపాధి కల్పించలేని ప్రభుత్వానికి ఎందుకు ఓటేయ్యాలని ప్రశ్నించారు. ప్రజలు మళ్లీ జగన్‌కే ఓట్లేసేంత అమాయకులు కాదని అచ్చెన్న వ్యాఖ్యనించారు.
"175 అసెంబ్లీ సీట్లు గెలుస్తామనే నమ్మకం జగన్‌కు ఉందా ?. నమ్మకం ఉంటే ఇప్పుడే జగన్ ఎన్నికలకు వెళ్లాలి. గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి. వైకాపాకు 175 స్థానాలు వస్తే తెదేపా కార్యాలయానికి తాళాలు వేస్తాం. ఏం చేశారని 175 స్థానాల్లో ప్రజలు వైకాపాను గెలిపిస్తారు ?.మళ్లీ జగన్‌కే ఓట్లేసేంత అమాయకులు కాదు ప్రజలు." - అచ్చెన్నాయుడు , తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
లోకేశ్ జూమ్ మీటింగ్‌లో వైకాపా ఎమ్మెల్యేలు: పదో తరగతి విద్యార్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్‌లో ప్రత్యక్షమయ్యారు. గమనించిన లోకేశ్.. సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, వైకాపా ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
విద్యార్థులను ఫెయిల్ చేయడం ప్రభుత్వం చేతగానితనమని.. జూమ్‌లో దొంగ ఐడీలతో సమావేశాన్ని డిస్టర్బ్ చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఆ సమావేశం నుంచి ఎమ్మెల్యే వంశీ తప్పుకున్నారు. కార్తిక్ కృష్ణ అనే విద్యార్థి పేరుతో కొడాలి నాని పాల్గొన్నారు. ప్రభుత్వ చేతగానితనాన్ని ఎండగడతానంటూ లోకేశ్ ఆ సమావేశాన్ని కొనసాగించారు.
ఇవీ చూడండి