మున్సిపల్ ఎన్నికల వివాదాలను ట్రైబ్యునల్ హోదాలో పరిష్కరించే విచారణాధికార పరిధిని జిల్లా ప్రధాన న్యాయమూర్తులుకు దఖలు పరుస్తూ.. నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోనాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది.రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ట్రైబ్యునల్ లేకపోవటం చట్ట విరుద్ధమంటూ కర్నూలుకు చెందిన కార్పొరేటర్ సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను దాఖలు చేసిన ఎన్నికల వివాద పరిష్కార పిటిషన్ను విచారణ పరిధిపై సందేహం వ్యక్తంచేస్తూ కర్నూలు పిడీజే తిరస్కరించారని పేర్కొన్నారు.
మున్సిపాలిటీ , మున్సిసల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్నికల వివాదాలను పరిష్కరించేందుకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం సెక్షన్ 75 ప్రకారం ఎన్నికల ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వడేరా వాదనలు వినిపించారు. ఒక వేళ ఏర్పాటు చేయకపోతే వివాదాలను పరిష్కరించే విచారణార్హత పరిదిని పీడీజేలకు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ .. కర్నూలు పీడీజేకు విచారణ అధికారం కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. ఆ వివరాలను నమోదు చేసిన ధర్మాసనం వ్యాజ్యాన్ని తిరష్కరించింది. కర్నూలు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాలో ఇదే పరిస్థితి ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించారు. పీడీజే కోర్టులకు ఎన్నికల వివాద కేసులను పరిష్కరించే ట్రైబ్యునల్ హోదా కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. అందుకు అంగీకరించిన ధర్మాసనం.. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చదవండి: అమరావతి ఎంపీ 'నవనీత్ రాణా'కు మరో షాక్.. ఆ వీడియో రిలీజ్!