Minister Perni Nani on AP New Cabinet: రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు రాబోతున్నారని ఆయన స్పష్టంచేశారు. రవాణా శాఖ మంత్రిగా ఎవరు వచ్చినా.. ప్రైవేట్ ట్రావెల్స్ సహా రవాణా రంగంలోని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా తాను కృషిచేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రూపొందించిన 'వన్ బస్ వన్ ఇండియా' వెబ్‌సైట్‌ను విజయవాడలో మంత్రి పేర్నినాని ఆవిష్కరించారు. బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీవోసీఐ) ప్రతినిధులు.. రెడ్‌బస్ తరహాలో వెబ్‌సైట్‌ను రూపొందించుకున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రైవేటు బస్సుల్లో టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు వెబ్సైట్ ఏర్పాటు చేయడం మంచి పరిణామమని మంత్రి అన్నారు. వన్ ఇండియా వన్ టాక్స్‌కు వెళ్దామని నా అభిప్రాయంగా సీఎం జగన్‌కి తెలిపానన్నారు. హోం టాక్స్ తగ్గించాలని ప్రైవేట్ ట్రావెల్స్ వారు కోరారని.. ఈ విషయంపై ప్రభుత్వం పరిశీలన చేస్తుందన్నారు.
మంత్రిగా ఇదే తన చివరి కార్యక్రమం కావొచ్చన్న మంత్రి.. వీలైనంత వరకు సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. లారీ యజమానుల కోసం తెలంగాణతో అంతర్‌రాష్ట్ర ఒప్పందం కోసం నేను చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదన్నారు. తెలంగాణ అధికారులు సహకరించక పోవడం వల్ల అగ్రిమెంట్ చేయలేకపోయినట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ఏపీకే ఎక్కువ నష్టమైనప్పటికీ... లారీ యజమానుల కోసం మాము ముందుకొచ్చినా తెలంగాణ అధికారులు స్పందించడం లేదన్నారు. అగ్రిమెంట్ విషయంలో తెలంగాణ ట్రాన్స్ పోర్టు కమిషనర్‌ను ఒప్పించలేకపోయామన్నారు.
'జగన్ కేబినెట్లో తనకు రవాణాశాఖ ఇవ్వగానే ఇదెందుకు ఇచ్చారని అనుకున్నా. నా డిపార్టుమెంట్‌లోని ఉన్నతాధికారులుగా కృష్ణబాబు, సీతారామాంజనేయులు, సురేంద్రబాబు ఉన్నారని తెలిసి సహకరిస్తారో లేదోనని ఆందోళన చెందాను. రవాణా శాఖ మంత్రిగా తనకు ఆ ఉన్నతాధికారులు అందరూ.. అన్నివిధాలా సహకారం అందించారు. వారందరికీ నా కృతజ్ఞతలు. ' అని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్