Amaravati Mahapadayatra today news: న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రాజధాని రైతులు చేపట్టిన యాత్రకు నెల్లూరు జిల్లా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. 30వ రోజు అంబాపురం నుంచి ప్రారంభమైన రైతులకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. అక్కడక్కడా వరుణుడు ఆటంకం కలిగించినా... అశేష జనవాహిని అన్నదాతలకు మద్దతు పలికింది. నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం డిసెంబర్ 15కల్లా.... అలిపిరి చేరుకుని డిసెంబర్ 17న తిరుపతిలోనే భారీ బహిరంగసభ నిర్వహిస్తామని అమరావతి పరిరక్షణ ఐక్యవేదిక ప్రకటించింది. ఇక నుంచి ప్రతిరోజూ 15 కిలో మీటర్లు నడుస్తామని నేతలు వెల్లడించారు.
Mahapadayatra: పాదయాత్రలో భాగంగా వస్తున్న క్రైస్తవ, ముస్లిం ప్రచార రథాలను పోలీసులు నిలిపివేయడం వివాదస్పందంగా మారింది. కుల, మతాలకు అతీతంగా... అమరావతి అందరిదని చాటేందుకు వస్తున్న రథాలను అడ్డుకోవడం సరికాదని రైతులు మండిపడ్డారు. రైతులకు మద్దతు తెలుపుతున్న తమను అడ్డుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ బీసీ కమిషన్‌కు నాయీబ్రాహ్మణ సంఘం ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని నెల్లూరు జిల్లా ఎస్పీకి లేఖ రాసింది.
వైకాపా ఎమ్మెల్యేల మదిలో అంతర్లీనంగా ఉన్న అమరావతి ఆకాంక్షను సీఎం జగన్ గుర్తించాలని రాజధాని రైతులు అన్నారు. పాదయాత్రకు సహకరించాలని వైకాపా ఎమ్మెల్యేలు సైతం కోరుకుంటున్నప్పటికీ సీఎం ధోరణికి భయపడి వెనకాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సైతం ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటూ మనసు ఉండబట్టలేక తమకు సాయం చేసేందుకు వచ్చారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి.. : Minister Suresh On Reforms in Education: సంస్కరణలతో విద్యా వ్యవస్థను పటిష్టం చేశాం: మంత్రి సురేశ్