Old woman murder case: విజయవాడలో మే 5న పున్నమ్మతోట అమెరికన్ ఆసుపత్రి వద్ద జరిగిన జూపూడి హైమావతి (83) హత్యకేసులో నిందితుడు నత్తా సురేష్ కరుణదేవ్ (27)ను పోలీసులు అరెస్టు చేశారు. అడ్మిన్ డీసీపీ డి.మేరీప్రశాంతి హత్య కేసు వివరాలు వెల్లడించారు. హైమావతి అమెరికన్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త 5 సంవత్సరాల క్రితమే చనిపోయారు. కూతురు గుంటూరులో ఉంటారు.
ఈ నెల 5వ తేదీ ఆమె హత్యకు గురైనట్లు బంధువులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి వివరాలు సేకరించారు. ఈ కేసును క్రైం ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, వెస్ట్ ఏసీపీ ఎం.వెంకటేశ్వర్లు నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేశారు. ఇంటి పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటీజీలను పరిశీలించారు. హతురాలి ఇంటి ముందు ఓ యువకుడు ఆటో ఎక్కి వెళ్లటంతో ఆరా తీశారు. అతడి ఫొటోను చుట్టుపక్కల వారికి చూపించటంతో.. గతంలో అతడు వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉన్న కుటుంబ సభ్యుడు నత్తా సురేష్ కరుణ్‌దేవ్‌గా తేలింది.
ప్రస్తుతం వరలక్ష్మినగర్‌లో అద్దెకు ఉంటున్న అతడు... గతంలో అడవినెక్కలంలోని ఓ కంపెనీలో పనిచేసి, ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాడు. జల్సాలు తీర్చుకునేందుకు డబ్బులు కావాల్సి రావడంతో హైమావతి గుర్తుకు వచ్చింది. ఆమె వద్ద బంగారం బాగా ఉండటంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. మే 3న వచ్చి ఆమెను అప్పు అడిగాడు. ఆ తర్వాత రోజు మళ్లీ రాగా, బ్యాంకులో పని ఉందని తోడు రమ్మని వృద్ధురాలు అడగ్గా.. వెళ్లి వచ్చాడు. ఈ నెల 5వ తేదీ ఉదయం వృద్ధురాలి ఇంటికి వచ్చి మధ్యాహ్నం వరకు అక్కడే గడిపాడు. ఆదరించి అన్నం పెడితే తిన్నాడు.
ఆమె పడుకున్న తర్వాత.. ఇనుపరాడ్‌తో తలపై బలంగా కొట్టాడు. మెడలో బంగారు గొలుసులు తీసే సమయంలో ఆమె లేచే సరికి, దిండుతో ముఖంపై అదిమి చంపేశాడు. 3 గొలుసులు, చేతులకు ఉన్న గాజులు, అలమరాలోని రూ.20వేల నగదు తీసుకుని పారిపోయాడు. రాజమండ్రి వెళ్లి బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నించగా, స్థానిక చిరునామా కలిగిన ఆధార్ కార్డు ఉంటేనే నగలను కొంటామని వ్యాపారులు చెప్పటంతో తిరిగి విజయవాడకు వచ్చేశాడు. ఆదివారం రామవరప్పాడు రింగ్ వద్ద వన్‌టౌన్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
48 గంటల్లోనే కేసు ఛేదించిన సిబ్బందిని సీపీ కాంతిరాణాటాటా అభినందించారు. సూర్యారావుపేట సీఐ వి.జానకిరామయ్య, హెడ్‌కానిస్టేబుళ్లు బి.రంగారావు, జి.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు సిహెచ్.శ్రీనివాసరావు, బి.బాలయ్య, పి.మాధవరావు, హోంగార్డు వి.వెంకటేశ్వర్లుతో పాటు సీసీఎస్ సీఐలు కృష్ణ, నాగ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు పి.అవినాష్, సి.హెచ్.ఎంఎస్.నారాయణ, పి.పూర్ణచంద్రరావు, ఎం.నాగేశ్వరరావులకు రివార్డులు అందించారు.
ఇవీ చదవండి: