Accuse Arrested బంగారు నగల దుకాణంలో ఎలక్ట్రీషియన్ పని నిమిత్తం వచ్చి.. అక్కడ కనిపించిన బంగారు, వజ్రాభరణాలను చూసి ఆశ పడి చోరీకి పాల్పడిన మేకల వీరబాబు (33) అనే యువకుడిని కృష్ణలంక పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి చోరీ చేసిన రూ.39.84లక్షల విలువైన వజ్రాభరణాలు, రూ.1.25 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం ఏడీసీపీ పి.వెంకటరత్నం తెలిపారు. సోమవారం లబ్బీపేటలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఏడీసీపీ తెలిపిన వివరాల మేరకు... మహాత్మా గాంధీ రోడ్డులో కార్టిలిన్ నగల దుకాణం ఉంది. ఇందులో ఇటీవల ఆధునికీకరణ పనులు చేపట్టారు. కొత్తపేటకు చెందిన మేకల వీరబాబు ఈ దుకాణంలో ఎలక్ట్రికల్ పనులకు వచ్చాడు. పది రోజులు పనులు చేశాడు. బంగారు, వజ్రాభరణాలను చూసి.. మనసులో దుర్భుద్ధి పుట్టింది. దుకాణంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో గమనించాడు. ఆగస్టు 17వ తేదీ రాత్రి పని ముగించుకుని... ఇంటి వెళ్లకుండా ఆ చుట్టుపక్కలే తిరిగాడు. అర్ధరాత్రి సమయంలో దుకాణం వెనుక వైపు షట్టర్ తాళం పగలగొట్టి లోపలికి వెళ్లాడు. వజ్రాభరణాలు, కౌంటర్‌లో రూ.1.8లక్షల నగదు తీసుకున్నాడు. ఈ లోగా అలారం మోగటంతో.. మిగిలిన నగలను వదిలి పారిపోయాడు.
పట్టించిన సీసీ కెమెరాలు
చోరీ విషయమై దుకాణం మేనేజర్ రాజేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో వేలిముద్రలు లభ్యం కాలేదు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. అందులో కనిపించిన యువకుడు ఎలక్ట్రీషియన్ వీరబాబుగా గుర్తించారు. ఇతడి కదలికలపై నిఘా ఉంచారు. సోమవారం పండిట్ నెహ్రూ బస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా.. అదుపులోకి తీసుకుని విచారించారు. నేరం చేసినట్లు నిర్ధారించుకుని.. అతడి వద్ద రూ.41.09 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించి అరెస్టు చేసిన కృష్ణలంక సీఐ ఎం.దుర్గారావు, క్రైం సీఐ కృష్ణ, క్రైం ఎస్సై కృష్ణబాబు ఇతర సిబ్బందిని పోలీస్ కమిషనర్ కాంతిరాణాటాటా, డీసీపీ విశాల్‌గున్నీ తదితరులు అభినందించారు. ఈ సమావేశంలో సౌత్ ఏసీపీ డాక్టర్ బి.రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: