Woman delivery on RTC bus: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళకు ఆర్టీసీ బస్సే ఆసుపత్రిగా మారింది. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని కిన్వట్ తాలూకా సింగరివాడకి చెందిన గర్భిణి మడావి రత్నమాల ఇంద్రవెల్లి నుంచి ఆదిలాబాద్‌కు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరింది. గుడిహత్నూర్ మండలం మనకాపూర్ వద్దకు రాగానే పురిటినొప్పులు రావడంతో.. డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు.
ఆర్టీసీ బస్సులోనే ఆ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. 108కు ఫోన్ చేసినా సకాలంలో రాకపోవడంతో వెంటనే డ్రైవర్.. బస్సును నేరుగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించారు. పరీక్షించిన అక్కడి ఆరోగ్య సిబ్బంది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు చెప్పడంతో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌తోపాటు ప్రయాణికులు సంతోషించారు. సమాచారం తెలుసుకున్న ఆర్టీసీ డీవీఎం మధుసూదన్, డీఎం విజయ్ ఆసుపత్రికి చేరుకుని తల్లి బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటన మేరకు పుట్టిన బాబు జీవితకాలం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విధంగా ఉచిత బస్ పాస్ అందిస్తామని అధికారులు తెలిపారు. తల్లీబిడ్డను సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన బస్సు డ్రైవర్ ఎం. అంజన్న, కండక్టర్ సీహెచ్ గబ్బర్‌సింగ్‌ను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి, సీఎండీ సజ్జనార్ అభినందించారు.
ఇదీ చదవండి: