Top Ten Demand Jobs in 2025 : ప్రపంచం మారుతోంది. అవసరాలూ మారుతున్నాయి. దానికి అనుగుణంగా మానవ వనరులూ కావాలి. కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం ప్రపంచవ్యాప్తంగా కొలువుల దశ దిశను నిర్దేశిస్తోంది. ఏఐతో ఉద్యోగ రంగంలో పెనుమార్పులు రావడం ఖాయం. ఒకవైపు భయం మరోవైపు భరోసా, ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుచుకుంటోంది. టెక్నాలజీ నుంచి పునరుత్పాదకత వరకు అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆ దారుల్లో నడిస్తే ఉద్యోగాలకు కొదవుండదంటున్నాయి మెకిన్సే, వరల్డ్, నాస్కామ్ ఎకనామిక్ ఫోరమ్‌లాంటి ప్రఖ్యాత సంస్థలు! రాబోయే రోజుల్లో మనదేశంలో ఉపాధి ధోరణులపై నాస్కామ్, ఫిక్కీ వంటి ప్రఖ్యాత సంస్థల అంచనాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న వేళ 2025లో టాప్ టెన్ ఉద్యోగ రంగాలేంటో చూద్దామా!
1.ఐటీ అండ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్ వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
- భారత ఐటీ రంగం ఏటా 8 శాతం వృద్ధిని నమోదు చేయడంతోపాటు 2025 నాటికి 30 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని నాస్కామ్ అంచనా వేస్తోంది.
- టెక్నాలజీ అండ్ ఐటీ రంగంలో పెద్ద సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలతో పాటు రోజువారీ ఆఫీసు పనులు నిర్వహించే వారికి కూడా డిమాండ్ ఉంది. డిజిటల్ మార్కెటింగ్ రంగంలోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి.
2.హెల్త్‌కేర్ అండ్ ఫార్మాస్యూటికల్స్ :
- కొవిడ్ మహమ్మారి అనంతరం అందరిలో ఆరోగ్యం పట్ల దృక్పథాలు మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, హెల్త్‌కేర్ రంగాల ఉద్యోగాల్లో 15 శాతం వృద్ధి ఉంటుందని మెకిన్సే గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ అంచనా వేస్తోంది. టెలి మెడిసిన్, హెల్త్‌కేర్ స్టార్టప్‌లు ఎక్కువవుతాయి.
- మెడికల్ రీసెర్చర్లు, టెలి మెడికల్ స్పెషలిస్టులు, క్లినికల్ ట్రయల్ కో-ఆర్డినేటర్లు అవసరమవుతారు. ఐదారేళ్లలో ఈ రంగంలో ఆరు లక్షల ఉద్యోగాలు రానున్నాయి.
చిన్న కోర్సులు చేసినా చాలు : హెల్త్‌కేర్ రంగం అంటే ఎం.ఎస్, ఎం.డి. చేసినవారికే రాణింపు అనేది నిజం కాదు. ఉన్నత స్థాయి వైద్యులకు సహాయకారులుగా నర్సింగ్, పారా మెడికల్, ఫార్మా వంటి కోర్సులు చేసిన నిపుణులు అవసరం.
- ప్లస్ టూ తర్వాత చేసే స్వల్పకాల కోర్సుల ద్వారా రేడియాలజీ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, ఫార్మసీ, మెడికల్ లేబొరెటరీ టెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లాంటి ఉద్యోగాలు పొందవచ్చు.
- పేషెంట్ మేనేజ్‌మెంట్, హాస్పిటల్ ఫైనాన్స్, అకౌంట్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజ్‌మెంట్ లాంటి కొత్త విభాగాల్లో మెడికల్ కోర్సులతో సంబంధం లేని సాధారణ కోర్సులు చేసినవారికి అవకాశం లభిస్తోంది. ఇంటర్ తర్వాత బీబీఏ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లాంటి కోర్సులు చేసిన యువతను ఎంపిక చేసుకుంటున్నారు.
- హెల్త్‌కేర్ రంగ విస్తరణలో భాగంగా ప్లేబొటమీ, మెడికల్ ల్యాబ్, ఫస్ట్ ఎయిడ్, ఎమర్జెన్సీ మెడిసిన్‌లలో శిక్షణ పొందినవారికి త్వరగా ఉద్యోగాలు దొరుకుతున్నాయి.
3.రెన్యూవబుల్ ఎనర్జీ :
- 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి (రెన్యూవబుల్ ఎనర్జీ)ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని భారతదేశం భావిస్తోంది.
- ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) అంచనాల ప్రకారం సోలార్, విండ్, గ్రీన్ హైడ్రోజన్‌లకు సంబంధించి 2025 నాటికి పది లక్షల మంది నిపుణులు అవసరం అవుతారు.
- సోలార్ ప్యానల్ టెక్నీషియన్లు, విండ్ టర్బైన్ ఇంజినీర్లు, గ్రీన్ హైడ్రోజన్ స్పెషలిస్టులు ప్రధానమైన ఉద్యోగాలు.
4.ఎంటర్టైన్మెంట్ అండ్ కంటెంట్ క్రియేషన్ :
- ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ మీడియా, గేమింగ్ వేగంగా వృద్ధి చెందుతున్నాయి.
- భారతదేశ మీడియా, ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ వ్యాపారం 2025 చివరి నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని కేపీఎంజీ రిపోర్టులు చెబుతున్నాయి.
- వీఎఫ్‌ఎక్స్ ఆర్టిస్టులు, గేమిషికేషన్ ఎక్స్‌పర్టులు, కంటెంట్ రైటర్లు అవసరం గణనీయంగా పెరగనుంది.
5.బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ :
- ఆర్థిక వ్యవహారాల్లో డిజిటల్ పాత్ర గణనీయంగా పెరుగుతోంది.
- పీడబ్ల్యూసీ అంచనాల ప్రకారం ఇండియా ఫిన్‌టెక్ మార్కెట్ 2025 చివరి నాటికి 150 బిలియన్ డాలర్లకు చేరనుంది.
- బ్లాక్‌చెయిన్ అనలిస్టులు, వెల్త్ అడ్వైజర్లు, రిస్క్ అనలిస్టుల అవసరం అధికమవుతుంది. ఎకనామిక్స్, ఎంబీఏ, ఫైనాన్స్, కామర్స్, డేటా అనాలిసిస్ తదితర కోర్సులు చేసినవారికి మంచి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
6.మాన్యుఫాక్చరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ :
- మేక్ ఇన్ ఇండియా, పీఎల్‌ఐ (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకాల అంతర్జాతీయ తయారీరంగ కేంద్రంగా మారాలని భారతదేశం లక్షిస్తోంది.
- మెట్రో ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, స్మార్ట్ సిటీలు తదితరాల వల్ల ఏటా 9 శాతం ఉద్యోగాల వృద్ధి ఉంటుందని ప్రపంచబ్యాంకు పేర్కొంటోంది.
- రోబోటిక్స్ టెక్నీషియన్లు, ప్రాజెక్టు మేనేజర్లు, ఇండస్ట్రియల్ ఇంజినీర్లు కీలకమైన ఉద్యోగాలు.
7.ఎడ్యుకేషన్ టెక్నాలజీ - ఎడ్‌టెక్ :
- దాదాపు 50 కోట్ల మంది యువతకు అవసరమైన ఆన్‌లైన్ లెర్నింగ్ సేవలను అందించే వేదికలు అవసరమవుతాయని అంచనా.
- కంటెంట్ క్రియేటర్లు, ఆన్‌లైన్ ట్యూటర్లు, డిజిటల్ ఎడ్యుకేషన్ కరిక్యులమ్ డెవలపర్ల వంటి ఉద్యోగాల వృద్ధి భారత్‌లో ఏటా 10 శాతం వరకు ఉంటుందని డెలాయిట్ అధ్యయనాలు చెబుతున్నాయి.
- ఎల్‌ఎంఎస్ డెవలపర్లు, గేమిఫైడ్ లెర్నింగ్ డిజైనర్లు, ఆన్‌లైన్ ఎడ్యుకేటర్లు ముఖ్యమైన ఉద్యోగ హోదాలు.
8.అగ్రిటెక్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ :
- స్మార్ట్ ఫార్మింగ్ టెక్నాలజీలు, ఆహార ఎగుమతుల వ్యాపారాల్లో పెట్టుబడులు పెద్దఎత్తున పెరుగుతాయని అంచనా.
- సప్లై చెయిన్ డిజిటైజేషన్, అగ్రి బిజినెస్, ఫార్మింగ్‌కి సంబంధించి సుమారు 20 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఫిక్కి నివేదిస్తోంది.
- అగ్రానమిస్టులు, ఫుడ్ టెక్నాలజిస్టులు, సప్లై చెయిన్ ఎక్స్‌పర్ట్‌లు ప్రధానమైన ఉద్యోగాలు.
- ఆర్గానిక్ ఫార్మింగ్, గార్డెనింగ్‌లలో నిపుణుల కొరత అధికంగా ఉంది. ఆసక్తి ఉన్నవారు ఈ రంగాల్లో ప్రవేశించవచ్చు
డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ప్రవేశించాలంటే ఫుడ్ టెక్నాలజీ కోర్సులే చేసి ఉండాల్సిన అవసరం లేదు. చిరుతిళ్ల స్థాయి నుంచి భారీ ప్యాక్డ్ ఫుడ్ ఇండస్ట్రీగా అవతరించిన పరిశ్రమలో సాధారణ టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసినా మంచి అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.
- డిప్లొమా ఇన్ డెయిరీ టెక్నాలజీ
- డిప్లొమా ఇన్ మీట్ టెక్నాలజీ
- డిప్లొమా ఇన్ ఫిష్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ
- ఫుడ్ అనాలిసిస్ అండ్ అస్యూరెన్స్
- డిప్ల్లొమా ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజ్‌మెంట్
- డిప్లొమా ఇన్ వ్యాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్
- డిప్లొమా ఇన్ ఫుడ్‌సైన్స్ టెక్నాలజీ ఇలాంటి విభిన్న డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను స్వల్పకాల వ్యవధిలో పూర్తిచేస్తే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలోకి అడుగు పెట్టవచ్చు.
9.ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్ :
- ఆన్‌లైన్‌లో రిటైల్ విక్రయాలు విస్తృతంగా పెరుగుతున్నాయి.
- ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం భారతదేశంలో ఏటా ఈ రంగంలో 21.5 శాతం వృద్ధి నమోదు కానుంది. వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్, సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్‌ల్లో మానవ వనరులకు డిమాండ్ పెరగనుంది.
- లాజిస్టిక్ మేనేజర్లు, ఈ-కామర్స్ అనలిస్టులు, వేర్‌హౌస్ ఆటోమేషన్ నిపుణుల కోసం మార్కెట్ ఎదురుచూడబోతోంది.
కనీస విద్యార్హతలుంటే :
- రిటైల్ రంగంలో భారీ మాల్స్, హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ చెెయిన్స్‌లో ఎంట్రీ స్థాయి ఉద్యోగాలైన సేల్స్‌మెన్‌కు పెద్దగా విద్యార్హతలు అవసరం లేదు. ఇంటర్/ టెన్త్ విద్యార్హతలుంటే చాలు. కస్టమర్స్‌తో వ్యవహరించాల్సిన తీరు, తమ వద్ద లభ్యమయ్యే ఉత్పత్తులపై అవగాహన కలిగించి స్టోర్స్‌కు పంపుతున్నారు.
- రిటైల్ రంగంలో మొత్తం పనిచేస్తున్న సిబ్బంది 4 కోట్లు కాగా వీరిలో 50 శాతం మంది సేల్స్ ఫోర్సే.
- గత దశాబ్ద కాలంగా ఉజ్వలంగా వెలుగొందుతున్న ఈ-కామర్స్ రంగంలో డెలివరీ ఫోర్స్ చాలా పెద్దది.
10.టూరిజం & హాస్పిటాలిటీ :
- కొవిడ్ అనంతరం అంతర్జాతీయ టూరిజం పుంజుకుంటోంది. భారతదేశ ఘనమైన వారసత్వం ఈ రంగం అందిస్తున్న అవకాశాలను అందుకుంటోంది.
- యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజమ్ ఆర్గనైజేషన్ (యూఎన్‌డబ్ల్యూటీఓ), వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజమ్ కౌన్సిల్ (డబ్ల్యూటీటీసీ) భారత్‌లో 20 శాతం టూరిజం రంగంలో ముఖ్యంగా ఇకో-టూరిజమ్, వెల్‌నెస్ సెక్టార్లలో ఉద్యోగాల వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.
- హాస్పిటాలిటీ మేనేజర్లు, ట్రావెల్ కన్సల్టెంట్లు, ఈవెంట్ ప్లానర్లు మొదలైనవి ముఖ్యమైన ఉద్యోగాలు.
- ప్రస్తుతం రూ.2 లక్షల కోట్లున్న భారత ఆతిథ్య పరిశ్రమ 2032 నాటికి రూ.3,20,000 కోట్లకు చేరుతుందన్న అంచనా మధ్య భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది.
- భారీ హోటల్స్‌తో పాటు మధ్య తరహా, చిన్న తరహా హోటల్స్ చెయిన్లు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ఆతిథ్య, పర్యాటక రంగాలు చెట్టపట్టాలేసుకొని ఎదుగుతున్నాయి. ఈ రెండు రంగాల్లో కలిపి 2029 నాటికి 5 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి.
ఏఐతో భయం వద్దు - సద్వినియోగం చేసుకుంటే మంచి ఉద్యోగాలు
టూరిజంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు- మేథోమదనంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్