రాష్ట్రంవ్యాప్తంగా 13 జిల్లాల్లోని 20 రెవెన్యూ డివిజన్లు, 175 మండలాల్లోని 3 వేల 335 పంచాయతీలు, 33వేల 632 వార్డుల్లో రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికోసం మూడు రోజులపాటు నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ చేపట్టారు.
అనంతపురం జిల్లాలో..
రెండోవిడతలో జిల్లాలోని 310 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ధర్మవరం డివిజన్‌లోని 19 మండలాలతో పాటు... కళ్యాణదుర్గం డివిజన్‌లోని పంచాయతీల్లో ఉదయం నుంచే నామినేషన్ల సందడి నెలకొంది. చాలాచోట్ల అభ్యర్థులు..పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు.
కడప జిల్లాలో ..
రెండోవిడత పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు పెద్దగా స్పందన కనిపించలేదు. రాయచోటి నియోజకవర్గంలో 78 పంచాయతీల్లో ఉదయం నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకూ ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు.
కర్నూలు జిల్లాలో..
జిల్లాలో పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్లు మొదటిరోజు మందకొడిగా సాగాయి. బుధ, గురువారాల్లో ఎక్కువ సంఖ్యలో పత్రాలు సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని 13 మండలాల్లో 240 పంచాయతీలు, 1980 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
చిత్తూరు జిల్లాలో..
మదనపల్లి రెవెన్యూ డివిజన్‌లో రెండో దఫా పంచాయతీ ఎన్నికలు మొదలయ్యాయి. మండలంలోని సీటీఎం క్రాస్ రోడ్డు పంచాయతీకి సర్పంచి అభ్యర్థిగా పద్మావతి అనే మహిళా నామినేషన్ వేయడానికి వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు ఆమె కారుపై దాడికి యత్నించారు. తప్పించుకున్న పద్మావతి.. తన నామినేషన్ దాఖలు చేశారు.
విజయనగరం జిల్లాలో
రెండో దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జిల్లాలో సందడిగా మొదలైంది. కురుపాం నియోజకవర్గంలో 137 గ్రామ పంచాయతీల్లో చాలాచోట్ల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, గరుగుబిల్లి మండలాల్లో గ్రామాల్లో ఉదయం నుంచే ఎన్నికల సందడి కనిపించింది.
పార్వతీపురం నియోజకవర్గంలో తొలిరోజు 25 మంది నామినేషన్లు దాఖలు చేశారు. గిరిజన ప్రాంతంలో సీపీఐ మద్దతుదారులు ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.
సాలూరు నియోజకవర్గం సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. కొన్ని పంచాయతీల్లో వైకాపా, తెదేపా, భాజపా మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు గెలుపు మాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు.
తూర్పు గోదావరి జిల్లాలో
జిల్లాలోని రాజమహేంద్రవరం, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో 18 గ్రామాలకు సంబంధించి ఆరు పంచాయతీల్లో నామినేషన్లు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో
కొవ్వూరు, జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లు రెండో దఫా పంచాయతీ పోరు ప్రక్రియ ప్రారంభమైంది. తేతలి, వేల్పూరు గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. అభ్యర్థులు పాదయాత్రగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. దువ్వలో..భాజపా, జనసేన ఉమ్మడి అభ్యర్థి..సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. ఇరగవరంలో అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులు.. నామపత్రం సమర్పించారు.
ప్రకాశం జిల్లాలో
జిల్లాలో రెండో విడతలోనూ నామినేషన్లు జోరుగా దాఖలవుతున్నాయి. ఒంగోలు, కందుకూరు, మార్కాపురం రెవెన్యూ డివిజన్లలో ఉదయం నుంచే కోలాహలం కనిపించింది.
శ్రీకాకుళం జిల్లాలో..
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో 86 నామినేషన్ దాఖలైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 98 పంచాయతీలు ఉండగా.. తొలిరోజు 39 పంచాయతీలకు 89 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇచ్చాపురం మండంలో 18, కంచిలిలో 22, కవిటిలో 17, సోంపేటలో 29 నామినేషన్లు స్వీకరించినట్లు అదికారులు ప్రకటించారు.
ఫిబ్రవరి 4సాయంత్రం 5గంటల వరకు నామినేషన్ల దాఖలుకు తుదిగడువుగా నిర్ణయించారు. ఫిబ్రవరి 5న పరిశీలన, 6న అభ్యంతరాలు పరిశీలించి 7న తుది నిర్ణయం తీసుకుంటారు. 8న ఉపసంహరణకు తుది గడువు విధించారు. ఈనెల 13న రెండోదఫా పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: ముగిసిన తొలిదశ ఎన్నికల నామినేషన్ల పరిశీలన