తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముజాహిద్నగర్లో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు.. పదేళ్ల రియాజ్, ఐదేళ్ల మహ్మద్ కారులో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి వీరిద్దరూ కనిపించకపోవడం వల్ల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సమయంలో కారు వెనుక సీటులో పిల్లలిద్దరూ విగతజీవులుగా కనిపించారు. వారిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు కావడం వల్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చిన్నారుల మృతిపై పలు అనుమానాలు...
కారు యజమాని అర్ధరాత్రి డోరు తీయగా పిల్లలు చనిపోయినట్లు గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అయితే లాక్ వేసి ఉన్న కారులోకి పిల్లలు ఎలా వెళ్లారు, అర్ధరాత్రి కార్ ఓనర్ ఎందుకు లాక్ తీసి చూశాడన్న అనుమానాలు కుటుంబసభ్యులు వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... శవ పంచనామా నిమిత్తం చిన్నారుల మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
ఇదీ చదవండిః 'స్వార్థ రాజకీయాలతో ప్రజాస్వామ్యం ఖూనీ'