తమిళనాడు రాష్ట్రంలోని చెంగలపట్టుకు చెందిన 45 మంది భక్తులు తిరుమలకు వెళ్లడానికి అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు చేరుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా భక్తులను పరిశీలించి పంపుతున్న సమయంలో... ఓ భక్తుడి వద్ద నిషేధిత గుట్కా ప్యాకెట్ దొరికింది. స్వాధీనం చేసుకున్న భద్రతా సిబ్బంది గుట్కా ప్యాకెట్‌ను పక్కన పడేశారు. తనిఖీలు పూర్తిచేసుకొని వెళుతున్న భక్తుడు ఆ ప్యాకెట్‌ను మళ్లీ తీసుకొనేందుకు ప్రయత్నించారు.
ఈ నేపథ్యంలో తితిదే భద్రతా సిబ్బంది, తమిళనాడు భక్తుల మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన ఎస్పీఎఫ్, తితిదే భద్రతా సిబ్బంది బస్సు ఎక్కుతున్న భక్తుడిని ఈడ్చుకొచ్చి చితకబాదారు. పోలీసులను అడ్డుకోబోయిన ఇతర భక్తులపై విచక్షణారహితంగా దాడి చేశారు. పోలీసులు కొడుతున్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న మరో భక్తుడి చరవాణిని లాక్కొని... పరుష పదజాలంతో దూషించారు. గొడవతో అలిపిరి టోల్‌గేట్ సమీపంలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు.
విచారణకు ఆదేశం...
దాడి ఘటనపై తితిదే ఈవో సింఘాల్ విచారణకు ఆదేశించారు. తనిఖీ కేంద్రం వద్ద దాడి ఘటనపై ఇన్‌ఛార్జి సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి విచారణ చేస్తున్నారు.సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండీ... సమస్యలు అధిగమిస్తాం.. ప్రతి హామీ నెరవేరుస్తాం!