Tirumala News: తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డిని రాష్ట్ర సర్వీసులో చేర్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసు అధికారిగా ఉన్న ధర్మారెడ్డి డిప్యుటేషన్‌ను పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం, డీవోపీటీ సుముఖంగా లేకపోవటంతో ఆయన తన సర్వీసుకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రాజీనామా సమర్పించి ఏపీ సర్వీసులోకి వచ్చే అవకాశముంది. రాజీనామా చేసిన వెంటనే రాష్ట్ర సర్వీసులోకి ధర్మారెడ్డిని తీసుకునేలా దేవాదాయశాఖలో ఫైలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.
దేవాదాయశాఖలో కార్యదర్శి హోదాలో ఆయన్ను సర్వీసులోకి తీసుకుని.. ఐడీఈఎస్ అధికారిగా ఆయనకు వస్తున్న జీతభత్యాలను కూడా చెల్లించేందుకు రెవెన్యూ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకటి, రెండు రోజుల్లోనే దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశమున్నట్లు సమాచారం. ఏవీ ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీసుకు రాజీనామా చేసిన వెంటనే దేవాదాయశాఖలో కార్యదర్శి హోదాతో పోస్టును ఏర్పాటు చేసి అందులోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఐడీఈఎస్ అధికారిగా ఆయనకు మరో రెండేళ్ల సర్వీసు ఉండటంతో కార్యదర్శి హోదాలో దేవాదాయశాఖలో నియమించనున్నారు.
కేంద్ర సర్వీసులో ఆయన తీసుకుంటున్న వేతనం, ఇతర సౌకర్యాలతో పాటు ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్లను యథాతథంగా కొనసాగించేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు సిద్ధం చేసింది. త్వరలోనే ధర్మారెడ్డి కేంద్ర సర్వీసుకు రాజీనామా చేసి రాష్ట్ర సర్వీసులో చేరనున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి