తిరుపతి, పట్టణ పరిసరాల్లోని స్థానిక ఆలయాల సందర్శన పునః ప్రారంభించనున్నట్లు పర్యాటకశాఖ తిరుపతి డివిజన్ మేనేజర్ గిరిధర్‌రెడ్డి తెలిపారు. కరోనా కారణంగా ఆగిపోయిన స్థానిక ఆలయాల పర్యాటక ప్యాకేజీలను రేపటి నుంచి తిరిగి మొదలు పెడుతున్నామని ఆయన అన్నారు. రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు తిరుపతి రైల్వేస్టేషన్, విష్ణునివాసం వద్ద పర్యాటక బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. రెండవ విడత కరోనా అనంతరం పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బస్సులు నడిపిస్తున్నామని తెలిపారు.
ప్యాకేజీల వివరాలు..
తిరుపతిలోని కపిలతీర్థం, తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం, గోవింద రాజస్వామి ఆలయాల్లో దర్శనం చేయించి.. తిరిగి పట్టణంలోని రైల్వేస్టేషన్ వద్దకు చేర్చేందుకు ఒక్కొక్కరికి రూ.100 వసూలు చేస్తామని పేర్కొన్నారు. తిరుపతి సమీపంలోని ఆలయాలైన కార్వేటి నగరంలోని వేణుగోపాల్ స్వామి ఆలయం, నాగలాపురం, నారాయణ వనంలోని వేద నారాయణస్వామి ఆలయాలు, సురుటుపల్లె, బుగ్గలోని శివాలయాలు, అప్పలాయగుంట ప్రసన్న కటేశ్వరస్వామి, నగరిలోని కరియమాణిక్యస్వామి ఆలయాల సందర్శన కోసం ఒక్కొక్కరికి రూ.250 వసూలు చేస్తామని వెల్లడించారు. ప్యాకేజీలకు సంబంధించి మరిన్ని వివరాలకై 9848007033 నెంబరు ద్వారా సంప్రదించాలని డివిజనల్ మేనేజర్ గిరిధర్‌రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: tirumala: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.05 కోట్లు