ప్రజారోగ్యంతో వైకాపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని అచ్చెన్నాయుడు ధ్యజమెత్తారు. హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కరోనా రోగుల మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. సకాలంలో ఆక్సిజన్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రాణవాయువు కోసం రోగుల ఆర్తనాదాలు వినిపించట్లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. గతేడాది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వెంటిలేటర్లు ఇచ్చినా ఇంతవరకు అమర్చలేదని.. నిర్లక్ష్యం వీడకపోతే ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
వైకాపా దొంగ ఓట్లతో విజయం సాధించింది
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల్లో వైకాపా దొంగ ఓట్లతో విజయం సాధించిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. పోలింగ్ రోజు వైకాపా అరాచకాలను ప్రజలంతా చూశారని అన్నారు. వైకాపా దురగాతాలను బయటపెట్టిన తెదేపా శ్రేణుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
నకిలీ ఓటర్ కార్డులను అడ్డుకోకుండా పోలింగ్ అధికారులు వైకాపాకు సహకరించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. దొంగ ఓట్లను అడ్డుకున్న తెదేపా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. స్పష్టమైన ఆధారాలు చూపించినా సీఈసీ స్పందించకపోవటం దారుణమని అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము దొంగ ఓట్లకు పాల్పడలేదని తిరుపతి వెంకన్న సాక్షిగా వైకాపా నేతలు ప్రమాణానికి సిద్ధమా అని అచ్చెన్నాయుడు సవాల్ చేశారు.
ఇదీ చదవండి: రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా