రాష్ట్ర సమస్యలపై వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఏనాడైన గట్టిగా మాట్లాడారా? అని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రశ్నించారు. తిరుపతిలో తెదేపా ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జగన్‌ను జైలులో పెడతారనే భయంతోనే వైకాపా ఎంపీలు మాట్లాడలేక పోతున్నారన్నారని రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. కేసుల నుంచి ఎలా బయటపడాలనేదే జగన్ ఆలోచన అని విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే తిరుపతిలో అభివృద్ధి జరిగిందని, వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టారా అని నిలదీశారు. కేంద్ర విద్యాసంస్థలు, అభివృద్ధి పనుల కోసం కేంద్రానికి సీఎం ఒక్క లేఖ రాయలేదని.. తిరుపతి ఉప ఎన్నికలో ఓట్ల కోసం ఇంటింటికీ లేఖలు రాస్తున్నారని ఎంపీ రామ్మోహన్ ఆక్షేపించారు. ఇసుక, మద్యం అమ్ముకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర సమస్యలపై పోరాడే పార్టీ ఒక్క తెదేపానే అని అన్నారు. ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
' పార్లమెంటులో ఎలా పోరాడుతున్నామో ప్రజలకు తెలుసు. సభ్యుల సంఖ్య తక్కువతో కొంత సమయమే కేటాయిస్తున్నారు. తక్కువ సమయంలోనూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తున్నాం. పనబాక లక్ష్మి గెలిస్తే మాతో పాటు పోరాటం చేస్తారు. తెదేపా హయాంలో తిరుపతిలో ఎంతో అభివృద్ధి జరిగింది.'- గల్లా జయదేవ్
ఎస్సీలపై జగన్‌కు ఏమాత్రం ప్రేమ లేదని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా ఇప్పుడు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. రెండేళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయైనా తీసుకొచ్చారా అని కనకమేడల నిలదీశారు. 20 నెలల కాలంలో రూ.1.46 లక్షల కోట్లు అప్పు చేశారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: మళ్లీ లాక్‌డౌన్ రానివ్వొద్దు : సీఎం జగన్