తిరుపతి-రేణిగుంట వయా చింతలచేను బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. బైపాస్ రోడ్డును కరకంబాడి రోడ్డులోని వినాయకసాగర్ దిగువ భాగంలో అనుసంధానం చేస్తూ మరో బైపాస్ రోడ్డు నిర్మాణానికి సర్వే పూర్తయింది. దాంతో భూముల ధరలు పెరిగాయి. స్థలాలు కొనుగోలు చేయడానికి పలువురు ముందుకు వచ్చినా దొరకని పరిస్థితి. ఇక్కడ స్థానం పొందాలనుకునే కొందరు నాయకులు.. దౌర్జన్యానికి దిగి భూముల్ని సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అందుకు అధికార పార్టీ పేరును ఉపయోగించుకుంటున్నారు.
ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయన పేరు శ్రీరాములు. పోలీసుశాఖలో ఏఎస్‌ఐ హోదాలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. వచ్చిన డబ్బుతో తిరుపతి నగరంలోని చింతలచేను పరిధిలోని రాఘవేంద్రనగర్‌లో ఇంటి స్థలం కొన్నారు. అన్ని దస్త్రాలను పరిశీలించి.. వివాదం లేదని గ్రహించి స్థలం కొనుగోలు చేశారు. ఇటీవల తిరుపతికి చెందిన కొందరు వ్యక్తులు వచ్చి స్థలం మాదే అంటూ శ్రీరాములు ఇంటి స్థలానికి రక్షణగా నిర్మించుకున్న ప్రహరీని కూల్చి వేశారు. ‘పోలీసు అధికారుల్ని సంప్రదిస్తే కేసు నమోదుకు నిరాకరించారు. రెవెన్యూ అధికారుల్ని కలవగా.. కూర్చొని మాట్లాడుకోండని ఉచిత సలహా ఇచ్చి పంపారు. అధికారుల సూచనల మేరకు అధికార పార్టీ పెద్దల్ని కలిస్తే చట్టం తన పని తాను చేసుకుని పోతుందంటూ సమాధానం ఇచ్చారు’ అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
తప్పెవరిది..?
1970లో చింతలచేను పరిధిలోని సర్వే నంబరు 171/2కు చెందిన 1.09 ఎకరాల భూమికి నారాయణస్వామి అనే వ్యక్తికి ప్రభుత్వం గెజిట్ ద్వారా రైత్వారీ పట్టా ఇచ్చింది. దానిని 1981లో ఓ వ్యక్తి కొనుగోలు చేసి లే అవుట్‌లు వేసి విక్రయించారు. అందులో ప్రస్తుతం 22 మంది ఇంటి స్థలాల్ని కొనుగోలు చేశారు. సర్వే నంబరు 127/2కు చెందిన భూముల్లో 85 శాతం నిర్మాణాలు జరిగిపోయాయి. పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుని అందులో దశాబ్దాలుగా పన్నులు చెల్లించుకుంటూ నివాసం ఉంటున్నారు.
ఖాళీ స్థలాలపై కన్ను
వివిధ కారణాలతో పలువురు ఇళ్లను నిర్మించుకోలేక ఆస్తిగా భావిస్తూ వచ్చారు. ఈ ఏడాది జూన్ నెలలో అదే సర్వే నంబరుతో ఖాళీగా ఉన్న స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్న దస్త్రాలతో వచ్చి కొందరు భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. బాధితులంతా ఏకమై పోలీస్‌స్టేషన్, రెవెన్యూ కార్యాలయం, నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మీ వద్ద ఉన్న అన్ని రకాల దస్త్రాలు ఇవ్వండి మేము రెవెన్యూ శాఖకు పంపి తహసీల్దార్ నుంచి నివేదిక తెప్పించుకుని ఎవరి భూమో తేల్చుతామని పోలీసులు చెప్పారని బాధితులు వివరించారు. దస్త్రాల్ని తీసుకుని ప్రత్యర్థులకు ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు పూర్తిగా విచారణ జరిపిన అనంతరం ఫోన్ రావడంతో మా దస్త్రాన్ని పక్కన పెట్టారని.. కనీసం పొజిషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. మీరు ఏదో ఒకటి సెటిల్ చేసుకోండని పదే పదే సమాధానం ఇస్తున్నారని బాధితులు వాపోయారు.
రెవెన్యూ దస్త్రాలు పరిశీలించి చర్యలు
తిరుపతి అర్బన్ మండలం కొంకా చెన్నయ్యగుంట పరిధిలోని సర్వే నంబరు 172-2లోని భూమికి సంబంధించిన వివరాలపై తహసీల్దార్ వెంకటరమణ ఇప్పటికే విచారణ ప్రారంభించారు. రైత్వారీ పట్టాలు పొందిన వ్యక్తులు మోసగించి 1981లో దురుద్దేశంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అలిపిరి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు నమోదు కావడంతో వారికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇరు వర్గాలకు సంబంధించిన దస్త్రాలను రెవెన్యూ కోర్టులో పరిశీలించి న్యాయం చేస్తాం. - ఆర్డీవో కనకనరసారెడ్డి, తిరుపతి
బోర్డు పీకేశారు..
ఇదే తరహాలో తిరుచానూరు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాన్ని, కొంత ప్రైవేటు స్థలాన్ని అధికార పార్టీ పేరుతో అన్యాక్రాంతం చేస్తున్నారు. ఒక వ్యక్తి తన స్థలంలో.. భూమి కోర్టు వివాదంలో ఉందని ఏర్పాటు చేసుకొన్న బోర్డును కూడా పెకలించి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఖాతరు చేయకుండా దౌర్జన్యం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ఇదీ చదవండి: డాక్టర్ కిరిటీ, డాక్టర్ శశి కుమార్‌ను పునర్నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు