Maha Sivaratri in AP : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం ముస్తాబవుతున్నాయి .గోపురాలు, ఆలయాలను రంగులు, విద్యుద్దీపాలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Maha Sivaratri in Srikalahasthi: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈనెల 24 నంచి మార్చి 8 వరకు ఘనంగా జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. భక్తులందరికీ దర్శనం కల్పించేలా మహా లఘు దర్శనం ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 9నుంచి 11 గంటలు, సాయంత్రం 4నుంచి 6గంటల వరకు విఐపిలకు దర్శనాలు కల్పించేలా చర్యలు చేపట్టారు.
Maha Sivaratri in Srisailam: శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు తొలిరోజు ధ్వజారోహణ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో ఎస్.లవన్న దంపతులు, ఫెస్టివల్ అధికారి చంద్రశేఖర్ ఆజాద్ త్రిశూల పూజ, భేరీ పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణలతో బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్థంభంపై ధ్వజపటాన్ని ఆవిష్కరించారు. నల్లమల్ల అడవుల్లో భక్తులు పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. శివ దీక్ష భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు శ్రీగిరికి చేరుకుంటున్నారు. భక్తులందరికీ శ్రీస్వామి అమ్మవార్ల అలంకార దర్శనం ఏర్పాటు చేశారు.
అన్నప్రసాదానికి వితరణ..
మహాశివరాత్రి బ్రహ్మోత్సావాల సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాస్వామి ఆలయానికి ఇరవై టన్నుల కూరగాయలను ఓ దాత విరాళంగా ఇచ్చారు. ఆలయంలో నిర్వహించే అన్నదాన ప్రసాద వితరణకు తన వంతుగా కూరగాయలు ఇచ్చాడు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కూరగాయల వ్యాపారి ప్రసాద్. గత 18 ఏళ్లుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. అలాగే ప్రముఖ శైవ క్షేత్రం కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో జరిగే నిత్యాన్నదానానికి రోజు కూరగాయలు అందజేస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు.
ఇదీ చదవండి :
Tirumala Tickets : శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల బుకింగ్‌లో సాంకేతికలోపం.. భక్తుల ఇబ్బందులు