రాజధాని అంశంపై ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని తెలిపారు. పులివెందుల, విజయవాడ కావొచ్చు.. రేపు మరో ప్రాంతం కావొచ్చన్నారు. సీఎం నివాసం ఎక్కడ ఉంటే అదే రాజధాన్న మంత్రి.. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదంటూ వ్యాఖ్యానించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ సెనేట్ హాల్ లో జరిగిన జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేశారు.
'2019లో శాసనసభలో మా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారమే రాజధానులు ఉంటాయి. అందులో ఎలాంటి మార్పులు ఉండవు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానులను నిర్ణయించాం. దీని ప్రకారం న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా విజయవాడ, కార్య నిర్వాహక రాజధానిగా వైజాగ్ ను ప్రకటించాం. నిజానికి రాజ్యాంగంలో రాజధాని అనే ప్రస్తావనే లేదు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని. అది పులివెందుల కావొచ్చు, విజయవాడ కావొచ్చు లేకపోతే వైజాగ్ కావొచ్చు '- మేకపాటి గౌతంరెడ్డి, ఐటీ మంత్రి
మూడో వేవ్‌పై ప్రత్యేక చర్యలు: మంత్రి గౌతంరెడ్డి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా.. కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చిత్తూరు జిల్లా ఇంఛార్జి మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ లో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నవరత్నాలతో పాటు గ్రామీణ నీటి సరఫరా, జలవనరుల శాఖలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో జిల్లా యంత్రాంగం పనితీరు మెరుగ్గా ఉందన్న మంత్రి.. చిత్తూరు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపిన అధికారులను అభినందించారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. జిల్లా అధికారులతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాష్ట్రస్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
'కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి దూరదృష్టితో అన్ని రకాల చర్యలు చేపట్టాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమైన 8 పథకాలను పూర్థిస్థాయిలో చిత్తూరు జిల్లాలో అమలు చేయటం చాలా అభినందనీయం. అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారు. కొవిడ్ వచ్చినప్పటికీ ఏ పథకం ఆపకుండా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం' - మంత్రి గౌతంరెడ్డి
ఇదీ చదవండి:
DRUGS CASE: డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి