Congress Support to Amaravathi: ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే అపూర్వ ఘట్టం అమరావతి ఉద్యమమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి అన్నారు. తిరుపతి వేదికగా అమరావతి రైతులు తలపెట్టిన సభకు.. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా హాజరైన ఆయన.. ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. 3 రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి.. మళ్లీ తెస్తామనటం దుర్మార్గమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఎలాంటి బిల్లులూ అవసరం లేదని వ్యాఖ్యానించారు. నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచనే ఉంటే.. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధించాలని హితవు పలికారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేందుకు అనేక కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
రైతుల త్యాగం నిరూపయోగం కాదు: మస్తాన్ వలీ
ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ స్పష్టం చేశారు. అమరావతే రాజధాని అని నమ్మించిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మాటమార్చారని విమర్శించారు. ప్రజలు తప్పక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రైతుల త్యాగం, కృషి నిరూపయోగం కాదన్నారు.
అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా చిత్తూరు జిల్లా తిరుపతిలో సభను ఏర్పాటు చేశారు. ఇందులో తెదేపా అధినేత చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ నారాయణ, రామకృష్ణ, ఎంపీ రఘురామకృష్ణరాజు , హీరో శివాజీ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
CBN On Amaravati Capital: అమరావతి ఏ ఒక్కరిదో కాదు.. ప్రజా రాజధాని: చంద్రబాబు