చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ రెండ్రోజులు పర్యటించనున్నారు. నేడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవలో పాల్గొననున్న సీఎం... రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3 గంటలకు బర్డ్ ఆసుపత్రికి వస్తారు. అక్కడ తితిదే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం అలిపిరికి చేరుకొని శ్రీవారి పాదాల వద్ద భక్తుల విరాళాలతో నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల ఆధునికీకరించిన అలిపిరి కాలినడక మార్గాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు.
తిరుపతిలో పలు కార్యక్రమాల ప్రారంభోత్సవ తర్వాత తిరుమల చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం స్వామివారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పిస్తారు. గరుడవాహన సేవలో పాల్గొంటారు. తర్వాత పద్మావతి వసతి గృహానికి చేరుకొని రాత్రి అక్కడే బసచేస్తారు. మంగళవారం తిరిగి వేంకటేశ్వరుని సేవలో పాల్గొననున్న సీఎం ..ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్‌ను కర్ణాటక ముఖ్యమంత్రితో కలిసి ప్రారంభిస్తారు. ఆలయ సమీపంలో నిర్మించిన లడ్డు బూందీ పోటునూ ప్రారంభిస్తారు.
పలు ప్రారంభోత్సవాల అనంతరం తిరుమల అన్నమయ్య భవనంలో రైతు సాధికార సంస్ధ, తిరుమల తిరుపతి దేవస్థానం మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి పద్మావతి అతిథి గృహానికి చేరుకొని ...మధ్యాహ్నం పన్నెండు గంటలకు అమరావతి తిరిగి పయనమవుతారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా తిరుపతిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వెస్ట్‌చర్చి, ఎన్టీఆర్ కూడలి, చెర్లోపల్లి రహదారి ఇలా పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు.
ఇదీ చదవండి: పల్లెల్లో కోతలు.. లోడ్ సర్దుబాటు కోసం 2-3 గంటల సరఫరా నిలిపివేత