వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే అవినీతి మితిమీరిందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తిరుపతి పార్లమెంటరీ ఉప ఎన్నికపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని తేదేపా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సమస్యలపై స్పందించని వైకాపా ఎంపీలు అవినీతికి పాల్పడుతూ... వాళ్లపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు అధికారాన్ని వినియోగించకుంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతికి పాల్పడుతూ... సంపాదించిన డబ్బుని ఎన్నికల్లో ప్రజలకు పంచుతున్నారని దుయ్యబట్టారు. చేతగాని ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు, ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శించారు.
అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల కాలంలో సమస్యల్లో ఉన్న ప్రజల కష్టాలను తీర్చేందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇటీవల జరిగినవి పంచాయతీ ఎన్నికలు ఎన్నికలే కావని.... పోలీసులు, డబ్బు, బెదిరింపులతో నామినేషన్ సైతం వేయనివ్వకుండా ప్రతిపక్షాలను అడ్డుకుని గెలిచారని విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలంతా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుని తెదేపాని గెలిపించి వైకాపాకు బుద్ధి చెప్పాలని సూచించారు. అధికార పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నప్పటికి రాష్ట్ర సమస్యలపై పోరాడింది శూన్యమన్నారు. తెదేపా ప్రజల హృదయాల నుంచి పుట్టిన పార్టీ అని.... రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
ఇదీ చదవండి: