జనతా కర్ఫ్యూను రాష్ట్ర ప్రజలు విజయవంతంగా పూర్తిచేశారు. కరోనా భూతాన్ని తరమికొట్టేందుకు తమవంతు బాధ్యతను సమర్థంగా నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వీయ నిర్బంధం పాటించారు. ఉదయం నుంచి జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దుకాణాలు మూతపడ్డాయి. అన్నిరకాల రవాణా సర్వీసులు ఆగిపోయాయి. జనతా కర్ఫ్యూ కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఉదయం నుంచి ఇళ్లలోనే ఉన్న ప్రజలు... సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. చప్పట్లు కొడుతూ, కంచాలు మోగిస్తూ... అత్యవసర సేవలు అందిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
గుంటూరు జిల్లాలో
గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతంగా సాగింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వడంతో... ప్రధాన రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సాయంత్రం 5 గంటలకు బయటికొచ్చిన జనం... వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, పాత్రికేయులు, అగ్నిమాపక శాఖ సిబ్బిందికి చప్పట్లతో ధన్యవాదాలు తెలిపారు. కొన్నిచోట్ల జాతీయ జెండాలు చేతబట్టి యువకులు నినాదాలు చేశారు. "కరోనా పారిపో" అంటూ నల్ల బెలూన్లు ఎగురవేశారు.
కృష్ణా జిల్లాలో
కృష్ణా జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగమయ్యారు. సాయంత్రం 5 గంటలకు చిన్నా, పెద్ద అంతా బయటకు వచ్చి.... పెద్దఎత్తున చప్పట్లు చరిచారు. కంకిపాడులో పోలీసులు వాహనాల సైరన్ మోగించి సంఘీభావం ప్రకటించారు. షేర్‌మహమ్మద్‌పేటలో ప్రజలు డప్పులు, కరతాళధ్వనులతో మద్దతు తెలిపారు. రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధులు విజయవాడ బెంజి సర్కిల్‌లో చప్పట్లు కొట్టి కృతజ్ఞత వెలిబుచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, కూలీలు... చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.
విశాఖ జిల్లాలో
విశాఖ జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతంగా ముగిసింది. సాయంత్రం ఇళ్ల నుంచి బయటికొచ్చి... చప్పట్లు కొడుతూ, కంచాలు మోగిస్తూ, శంఖాలు ఊదుతూ... అత్యవసర సేవల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఎలమంచిలిలో అగ్నిమాపక అధికారులు... వాహనాన్ని పురవీధుల్లో తిప్పారు. లోకోషెడ్‌లో ఇంజిన్ల హారన్ మోగించారు. కరోనా ప్రమాదం నుంచి ప్రపంచం బయటపడాలంటూ... శారదా పీఠాధిపతులు పూజలు చేశారు. విజయనగరం, శ్రీకాళం జిల్లాల్లో జనతా కర్ఫ్యూ, చప్పట్లు కొట్టే కార్యక్రమాలు నిర్వహించారు.
తూర్పుగోదావరి జిల్లాలో
కలిసికట్టుగా కరోనా భూతాన్ని తరిమికొడదామని... తూర్పుగోదావరి జిల్లా ప్రజలు పిలుపునిచ్చారు. రోజంతా జనతా కర్ఫ్యూ పాటించి, సాయంత్రం కరతాళ ధ్వనులు చేశారు. కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఇతర అధికారులు... నివాసాల బయటికొచ్చి చప్పట్లు కొట్టారు. కరోనా బాధితులు కోలుకోవాలంటూ రావులపాలెం సత్యసాయి మందిరంలో ప్రజలు పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో జనతా కర్ఫ్యూ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అత్యవసర సేవల వారికి చప్పట్లతో కృతజ్ఞత తెలిపారు.
ప్రకాశం జిల్లాలో
ప్రకాశం జిల్లా ప్రజలు ఆదివారమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం వేళ వీధుల్లోకొచ్చి.... చప్పట్లు చరుస్తూ, కంచాలు మోగిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్... సిబ్బందితో కలిసి చప్పట్ల కొట్టారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ సాగింది. ఉదయమంతా నిశ్శబ్దంగా ఉన్న పట్టణాలు, పల్లెలు... సాయంత్రం ప్రజల కరతాళ ధ్వనులతో మార్మోగాయి. అనంతపురం జిల్లాలో జనతా కర్ఫ్యూకు విశేష స్పందన లభించింది.
చిత్తూరు, కడప జిల్లాల్లో
కరోనా నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూ... చిత్తూరు జిల్లాలో విజయవంతంగా పూర్తయింది. సాయంత్రం 5 గంటలకు ఇళ్ల నుంచి బయటికొచ్చి ప్రజలు... ప్రభుత్వ సంకల్పానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కడప జిల్లాలో ప్రజలు కర్ఫ్యూ పాటించారు. సాయంత్రం కరతాళ ధ్వనులు చేశారు. నెల్లూరు జిల్లాలో జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా సాగింది. అత్యవసర సేవల సిబ్బందికి... చప్పట్లతో ప్రజలు మద్దతు తెలిపారు.
ఇదీ చదవండి : ఏకతాటిపైకి ఆంధ్రా జనం... ఊరూవాడా నిశ్శబ్దం