AP High Court made interesting: జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులకు క్షమాభిక్ష పెట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికార పరిమితులు ఏమిటో నిర్ణయిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఏదైనా కేసులో జీవిత శిక్ష పడ్డవారికి ఆరు నెలలు శిక్ష అనుభవించాక ప్రభుత్వం అనుకున్నదే తడవుగా క్షమాభిక్ష ప్రసాదించలేదని వ్యాఖ్యానించింది. క్షమాభిక్ష విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారం విషయంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. చట్టంలోని నిబంధనల మేరకే ఆ అధికారాన్ని వినియోగించాల్సి ఉంటుందని తెలిపింది. పాలసీ తెచ్చామనే కారణంతో కనీసం 14 ఏళ్లు శిక్ష అనుభవించాల్సిన వారికి క్షమాభిక్ష పెట్టడం సమర్థనీయమేనా అని ప్రశ్నించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీపై పలు సందేహాలు లేవనెత్తింది. వాదనల కొనసాగింపునకు విచారణను ఈనెల 26 కి వాయిదా వేసింది .
జీవో 121ని రద్దు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన నవనీతమ్మ :
1996లో తన భర్త పార్థమరెడ్డిని హత్య చేసిన కేసులో ఎనిమిది మంది నేరస్థులు ' జీవిత ఖైదు ' అనుభవిస్తున్నారు. వారికి ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించింది. క్షమాభిక్ష పేరుతో విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా ( ప్రస్తుతం తిరుపతి ) చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి చెందిన ముడి నవనీతమ్మ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభుత్వ పాలసీ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. తన భర్తను హత్య చేసిన నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ.. ఈ ఏడాది ఆగస్టు 14 జారీచేసిన జీవో 121 ని రద్దు చేయాలని కోరారు. క్షమాభిక్ష ద్వారా బయటకు వచ్చిన పుచ్చలపల్లి నరేన్ రెడ్డి , కొండూరు దయాకర్ రెడ్డి , పుచ్చలపల్లి శ్రీనివాసులురెడ్డి , పుచ్చలపల్లి నిరంజన్ రెడ్డి , పుచ్చలపల్లి సుబ్రమణ్యంరెడ్డి , యల్లసిరి మస్తాన్ , కలతూరు సుధాకర్ రెడ్డి , చెన్నూరు వెంకటరమణారెడ్డిలను తిరిగి జైలుకు పంపేవిధంగా ఆదేశాలు జారీచేయాలని కోరారు.
14 ఏళ్లు పూర్తి కాకుండానే క్షమాభిక్ష
తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరపు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు . కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించకుండా దోషులను విడుదల చేశారన్నారు. వారిలో కొందరు 8, మరికొందరికి 11 ఏళ్ల జైలు శిక్షను మాత్రమే అనుభవించారన్నారు. మరణ శిక్ష పడి కనీసం పదేళ్లు జైలు జీవితం అనుభవించిన వారి విషయంలో జీవిత ఖైదుగా మార్చే అధికారం గవర్నరుకు ఉందని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అంతేతప్ప జీవిత ఖైదుపడి కనీసం 14 ఏళ్లు జైలు జీవితం అనుభవించని వారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి వీల్లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
14 ఏళ్లు పూర్తి కాకుండానే క్షమాభిక్ష ప్రసాదిస్తున్న విషయం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లలేదన్నారు . నేరస్థులు విడుదల అయితే తనకు ముప్పు ఉందనే విషయాన్ని పిటిషనర్ పోలీసులకు తెలిపారన్నారు . ప్రభుత్వం పూర్తి వివరాలను గవర్నర్ వద్ద ఉంచలేదని పిటిషనర్ తరుపున న్యాయవాధి కోర్టులో పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం నచ్చినట్లు పాలసీ తీసుకొచ్చి క్షమాభిక్ష ప్రసాదించాలని గవర్నర్ను కోరడం సరికాదన్నారు. ప్రభుత్వ పాలసీ చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు .
అధికరణ 161 ను అనుసరించి ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం
ప్రభుత్వ పాలసీని పిటిషనర్ సవాలుచేయడానికి వీల్లేదని హోంశాఖ తరపు ప్రభుత్వ న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించారు . పాలసీ వెనుక దురుద్దేశం, బయటి నుంచి ఒత్తిడులు లేవన్నారు . పాలసీని తెచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని మహేశ్వరరెడ్డి కోర్టుకు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 175 మందిని విడుదల చేశామన్నారు . అధికరణ 161 ను అనుసరించి ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్కు ఉందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
కమిటీ చేసిన సిఫారసులను పరిగణనలోకి తీసుకొని సత్ప్రవర్తన, పశ్చాత్తాప్పడుతున్న వారిని విడుదల చేయడం ఆనవాయితి వస్తున్నట్లు వెల్లడించారు. 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించకుండానే విడుదల చేయవచ్చ నిమహేశ్వరరెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనల కొనసాగింపునకు కోర్టు విచారణను ఈనెల 26 కి వాయిదా వేసింది . ప్రస్తుత కేసు విషయంలో ప్రభుత్వ రికార్డులు , నోట్ఫైల్స్ తదితర వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర హోం శాఖకు స్పష్టంచేసింది.
ఇవీ చదవండి: