Higher study: కన్నడ భాషలో ఆరవ తరగతి చదువుకోవాలంటే అక్కడ విద్యార్థులు కష్టాలు పడాల్సిందే... సొంత ఊరిలో అయిదో తరగతి వరకు మాత్రమే ఉంది... అందువల్ల ఆ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే వేదవతి నదిని రోజూ దాటాల్సిందే... 40 మందికి పైగా విద్యార్థులు నదిని దాటి కర్ణాటకకు వెళ్తున్నారు. వారే బల్లూరు గ్రామానికి విద్యార్థులు.
Higher study: కర్నూలు జిల్లా హాలహర్వి మండలం బల్లూరు పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు కన్నడ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ 103 మంది విద్యార్థులు చదువు సాగిస్తున్నారు. 5వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత 6వ తరగతికి గుల్యం గ్రామంలో ఉన్న కన్నడ ఉన్నత పాఠశాలకు వెళ్లాలి. కానీ వారు వివిధ రకాల కారణాల వల్ల పాఠశాలకు వెళ్లడం లేదు. బల్లూరు గ్రామ సమీపంలో ఉన్న కర్ణాటకలోని బళ్లారి జిల్లా తాళ్లూరు గ్రామ కన్నడ ఉన్నత పాఠశాలకు వెళుతున్నారు. అక్కడికి వెళ్లాలంటే వేదవతి నదిని దాటుకుని వెళ్లాలి. ప్రమాదమని తెలిసినా చదువు కోసం తప్పడం లేదంటున్నారు. వర్షాకాలంలో నది పొంగిపొర్లుతుంది. ఆ సమయంలో నీటి ప్రవాహం తగ్గే వరకు బడికి సెలవు పెట్టాల్సి వస్తుంది. విద్యార్థుల కొన్నేళ్లుగా ఇలాగే వెళ్తున్నారని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కర్నాటక-ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలు వివిధ అవసరాలకు వేదవతి నదికి అతి సమీపంలో ఉన్న గ్రామాలకు ప్రమాదమని తెలిసినా పుట్టిల్లో ప్రయాణం చేస్తుంటారు. కర్నాటక, ఏపీ ప్రభుత్వాలు కలసి వేదవతి నదిపై వంతెన నిర్మాణం చేపట్టాలని సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
"మా ఊరిలో అయిదో తరగతి వరకే స్కూలు ఉంది. ఆరో తరగతి నుంచి వేరే ఊరికి వెళ్లాలంటే నది దాటాలి. మాకు కష్టంగా ఉంది. చిన్నపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఎక్కువగా వస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి కట్టించాలని కోరుకుంటున్నాం" - మల్లీశ్వరి, పదో తరగతి విద్యార్థిని
ఇదీ చదవండి: పూర్తి కాని రహదారి పనులు.. అవస్థలు పడుతున్న వాహనదారులు