strange custom in Holi festival: కర్నూలు జిల్లాలో హోలీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో ఈ పండుగ రోజు మగవాళ్లు అందరూ.. ఆడ వేషం ధరించి రతి మన్మథులను పూజిస్తారు. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే... 'జంబలకడిపంబ' సీన్ రిపీట్ అవుతుంది. మగాళ్లంతా స్త్రీ వేషధారణలోకి మారిపోతారు.
ఈ ఆచారం తరతారాల నుంచీ కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కోరికలు తీరుతాయని తమ నమ్మకమని చెబుతారు స్థానికులు. చీర కట్టుకొని, నగలు, పూలు ఆలంకరించుకుని.. అచ్చం మగువలుగా రెడీ అవుతారు. అనంతరం రతీ మన్మథులను పూజిస్తారు.
"ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ సమయంలో మగవారు ఆడవేషం వేస్తారు. అలా ఆడ వేషధారణలో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి. నేను 5 ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నాను." - విద్యార్థి
strange custom in Holi festival: పురుషులు ఆడవాళ్లు వేషధారణ చేసుకుని పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని.. గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని.. ఇంట్లో ఏ సమస్యలు ఉండవని స్థానికులు చెబుతున్నారు. అందుకే ప్రతీ ఏడాది హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆచారాన్ని చూడటానికి భారీగా వస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి మహిళల వేశధారణలో పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకుంటారని చెబుతున్నారు
"చిన్నప్పటి నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నాను. ఇది తరతరాల సంప్రదాయం. ఇలా ఆడవారి వేషధారణలో మన్మథ స్వామివారిని పూజిస్తే.. పంటలు బాగా పండుతాయి. గ్రామానికి ఎలాంటి కష్టాలూ రావు. ఇంట్లో సమస్యలు ఉండవు. ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకొంటాం." - గ్రామస్థుడు
ఇదీ చదవండి: అమ్మవారే ఇంటింటికీ వెళ్తారు.. ఇదే అక్కడి ప్రత్యేకత..!