రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాల, ఉద్యాన, పశు పరిశోధనా కేంద్రాల్లోకి వరద నీరు ప్రవేశించింది. తిమ్మాపురం ఎస్సీ కాలనీ, బుక్కాపురంలోకి నీరు చేరింది. మహానంది మండలం గాజులపల్లె వద్ద వరదలకు రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోవటంతో.. ఈ మార్గంలో తిరిగే పలు రైళ్లను నిలిపివేశారు. నంద్యాలలో హుబ్లీ-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌తో సహా మరో 4 గూడ్స్ రైళ్లను నిలిపివేశారు. గుంటూరు-గుంతకల్లు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రకాశం జిల్లా దిగువమెట్టలో గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. మరో 5 గూడ్స్ రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
పొంగిన వక్కిలేరు, నల్లవాగులు
నంద్యాల పట్టణంలో భారీగా వర్షం కురుస్తోంది. చామకాల్వ పొంగటంతో... కాల్వ ఒడ్డునున్న పలు కాలనీల్లోకి వర్షపునీరు చేరింది. నంద్యాల మండలంలోని హైస్కూలు కొట్టాల వద్ద రహదారిపైనున్న కల్వర్టు తెగిపోయింది. ఆళ్లగడ్డ మండలంలోని రామతీర్థం, కాసింతల ఆలయాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. ఆళ్లగడ్డ మండలంలోని పలు గ్రామాలు నీట మునిగాయి. వక్కిలేరు, నల్లవాగులు పొంగి ప్రవహిస్తున్నందున.. ఆళ్లగడ్డలోని గురుకుల, ఉన్నత పాఠశాలల్లోకి వర్షపు నీరు చేరింది. బండి ఆత్మకూరు మండలంలో ప్రేమ చెరువు కట్టతెగిపోయింది. కడమల కాల్వ, వెంగలరెడ్డి పేట గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది.
వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు
జిల్లాలోని సంజామల మండలం ముదిగేడు సమీపంలో పొంగుతున్న వాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. సకాలంలో పోలీసులు, అధికారులు స్పందించి... బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులను రక్షించారు. చాగలమర్రి మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాజోలి ఆనకట్ట వద్ద కుందూ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజోలి ఆనకట్ట నుంచి 55 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. వక్కిలేరు, ఎర్రవంక పొంగి ప్రవహిస్తోండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.
నీటి పాలైన వేలాది ఎకరాలు పంట
జిల్లావ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలకు.. వాగులు, వంకలు పొంగుతున్నాయి. వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ హెచ్చరికలు జారీ చేసింది. వాగుల తీరాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాలకు జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి :