Biomedical waste treatment plant వ్యాధులకు కారణమయ్యే బయోమెడికల్ వేస్టేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంటు తమకొద్దని తూర్పుగోదావరి జిల్లా రంగంపేట, కాకినాడ జిల్లా పెద్దాపురం, సామర్లకోట మండలాల ఆరు గ్రామాల ప్రజలు పట్టుబడుతున్నారు. ఆసుపత్రులనుంచి సేకరించిన జీవ వ్యర్థాలను సమర్థంగా నిర్వీర్యం చేయాలి. లేదంటే ప్రజారోగ్యానికి ముప్పు. దీనికి భిన్నంగా ప్లాంటు నిర్మిస్తున్నారంటూ గ్రామస్థులు న్యాయస్థానంతోపాటు ఎన్జీటీని ఆశ్రయించారు. 11 రోజులుగా నిరసన దీక్షలను కొనసాగిస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు అన్ని అనుమతులు పొందాక అడ్డుకోవడం సరికాదని యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం సూచనలతో పోలీసు బందోబస్తు మధ్య పరిశ్రమ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
ప్రజాభిప్రాయ సేకరణలో వద్దన్నా..
బయోవ్యర్థాల నిర్వహణ కేంద్రం రాజానగరం మండలంలో ఉంది. రెండోది రంగంపేట మండలంలోని మర్రిపూడి పంచాయతీ శివారులో నిర్మించాలని 2017నుంచి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి రెండుసార్లు ప్రజాభిప్రాయాన్ని సేకరించగా.. గ్రామస్థులనుంచి వ్యతిరేకత వచ్చింది. అయినప్పటికీ పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చారు. కాలుష్య నియంత్రణ మండలి 2018లో నిర్మాణ అనుమతులు (సీఎఫ్‌ఈ) ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబరు 31లోగా పరిశ్రమ నిర్మించకపోతే అనుమతులు రద్దు చేస్తామని కూడా పేర్కొంది. దీంతో యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించి పరిశ్రమ నిర్మాణానికి పోలీసు భద్రతను కోరి ఆ మేరకు సాధించింది. నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళనలు మళ్లీ తీవ్రమయ్యాయి. పరిశ్రమను మర్రిపూడివాసులు, పెద్దాపురం మండలం కొండపల్లి, చినబ్రహ్మదేవం, ఆర్.బి.పట్నం, ఆర్.బి.కొత్తూరు.. సామర్లకోట మండలం జి.కొత్తూరు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వారికి అన్ని పార్టీలూ మద్దతు తెలుపుతున్నాయి. ఈ వివాదంపై ఎన్జీటీ నిర్ణయం ఈనెల 26న వెలువడే వీలుంది.
అనుమతి రద్దు చేసేవరకు ఆందోళన: పుట్టా వెంకటేష్, మర్రిపూడి
ఆసుపత్రుల్లో వ్యర్థాలన్నీ మా గ్రామాలమీదుగా పరిశ్రమకు వెళ్తాయి. కరోనా భయంనుంచే ఇంకా బయటపడ లేదు. ఇబ్బంది లేకుండా పరిశ్రమ నిర్వహిస్తామని మొదట్లో చెబుతారు. తర్వాత గాలికొదిలేస్తారు. వైరస్‌ల ముప్పున్న ఈ పరిశ్రమ మాకొద్దు. అనుమతులు రద్దు చేసే వరకు పోరాడతాం.
అధ్యయనం చేశాకే అనుమతులు: అశోక్‌కుమార్, పర్యావరణ ఇంజినీరు, కాలుష్య నియంత్రణ మండలి
ప్లాంటు ఏర్పాటుకు పర్యావరణ, నిర్మాణ అనుమతులున్నాయి. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు వ్యతిరేకించినా వారి వాదన ఎంతవరకు సబబని నిపుణుల కమిటీ అధ్యయనం చేశాకే అనుమతులిచ్చారు. డిసెంబరులోగా పరిశ్రమ నిర్మించకపోతే అనుమతులు రద్దు చేయాలనే ఆలోచన ఉంది.
ఇవీ చదవండి: