Land For YCP Office: విద్యా ప్రాంగణం ఆవరణలో వైకాపా కార్యాలయానికి స్థలం కేటాయించాలన్న ప్రతిపాదన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వివాదాస్పదమైంది. కాకినాడ గ్రామీణ మండలం తిమ్మాపురం పరిధిలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మల్లాడి సత్యలింగ నాయకర్ పీజీ సెంటర్ ఉంది. దీనికి ఛారిటీ సంస్థ 40 ఎకరాల స్థలమివ్వగా, అందులో సర్వే నంబర్లు 110, 113లోని 4.41 ఎకరాల స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ పేరిట కేటాయించారు. ‘భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు ఈ భూమిని వెనక్కి తీసుకోవచ్చ’న్న నాటి నిబంధనను అడ్డం పెట్టుకుని ఇందులో 2.10 ఎకరాలను అధికార పార్టీ కార్యాలయానికి కేటాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.20 కోట్ల వరకు ఉంటుంది. ప్రభుత్వ దస్త్రాల్లో ఈ స్థలం బండిబాటగా నమోదైనప్పటికీ, ఈ మార్గంలో రాకపోకల్లేవు. ఇక్కడ కొందరు తాత్కాలికంగా షెడ్లు వేసుకోగా, వాటిని మరోచోటుకు తరలించి ఆ స్థలం పార్టీ కార్యాలయానికి ఇవ్వాలన్నది ప్రతిపాదన.
ఈ భూకేటాయింపునకు అభ్యంతరం లేదని తీర్మానం చేసి పంపాలని రెవెన్యూ శాఖ నుంచి లేఖ అందిందని తిమ్మాపురం సర్పంచి బెజవాడ వీరవెంకట సత్యనారాయణ తెలిపారు. దీనిపై నిర్ణయం తీసుకోలేదన్నారు. గతంలో ఇచ్చిన భూమి వెనక్కి ఇవ్వాలని రెవెన్యూ అధికారుల నుంచి లేఖ వచ్చిందని పీజీ కేంద్రం ప్రిన్సిపల్ ఎం.కమలకుమారి చెప్పారు. యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ‘పీజీ సెంటర్‌కు ఇచ్చిన ప్రభుత్వ స్థలాన్ని వారు వాడుకోవడం లేదు. ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వెనక్కి తీసుకుంటున్నాం. దీన్ని వైకాపా కార్యాలయానికి ఇవ్వాలని అడిగారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆ వెసులుబాటు ఉంది. ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రతిపాదనలు పంపలేదు. పంచాయతీ తీర్మానాన్ని మేం అడగలేదు’ అని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి: పాత వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ ఫీజుల బాదుడు