JNTUK Convocation: విశ్వవిద్యాలయం నుంచి బయటకు వెళ్లే విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం- కాకినాడ (జేఎన్‌టీయూకే) ఎనిమిదో స్నాతకోత్సవలో కులపతి హోదాలో ఆయన పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన స్నాతకోత్సవంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి గవర్నర్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.
జాతీయ విద్యావిధానం-2020 దేశీయ విద్యను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. భారత దేశాన్ని నాలెడ్జ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో దూరదృష్టితో సమగ్రమైన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీతో భారతదేశం ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిందని పేర్కొన్నారు.
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మాజీ సీఎండీ వడ్లమాని వెంకట రామశాస్త్రికి జేఎన్‌టీయూకే డాక్టరేట్ అందించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో భాగంగా రాష్ట్రం నుంచి ఐదు విశ్వవిద్యాలయాలు ఎంపికైతే.. అందులో జేఎన్‌టీయూకే ఉండటం సంతోషకరమని పేర్కొన్నారు. జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జి.వి.ఆర్.ప్రసాదరాజు విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక సమర్పించారు.
పసిడి పతకాలు.. పీహెచ్‌డీలు..
కాకినాడ జేఎన్‌టీయూ ఎనిమిదో స్నాతకోత్సవ వేళ.. 2015-19, 2016-20 విద్యా సంవత్సరాల్లో వివిధ కోర్సుల విద్యార్థులకు పట్టాలతోపాటు.. 55 మందికి పసిడి పతకాలు, 12 మందికి ఎండోమెంట్ అవార్డులు.. 263 మందికి పీహెచ్‌డీలు అందిస్తున్నట్లు వీసీ ప్రసాదరాజు చెప్పారు.
నైతిక విలువలతో కూడిన పౌరులను తయారుచేయాలి: గవర్నర్
సామాజిక స్పృహ, నైతిక విలువలతో కూడిన పౌరులను తయారుచేయడమే ఉన్నత విద్య లక్ష్యం కావాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వర్సిటీ కులపతి హోదాలో రాజ్‌భవన్ నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించారు. నూతన విద్యావిధానంలో భాగంగా విద్యాభివృద్ధికి నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ముందుగా ఉపకులపతి నిమ్మ వెంకటరావు వర్సిటీ ప్రగతి నివేదికను తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: