తూర్పుగోదావరి జిల్లాలో ఒక కరోనా అనుమానిత కేసు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని అక్కడి పాలనాధికారి మురళీధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ వైద్యాధికారుల నుంచి సమాచారం వచ్చిందన్నారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తిని గుర్తించామని చెప్పారు. అనుమానిత వ్యక్తిని కాకినాడ జీజీహెచ్‌లో కరోనా ఐసోలేషన్ వార్డులో ఉంచామన్న కలెక్టర్... అనుమానిత వ్యక్తి ఇటీవల దక్షిణకొరియా నుంచి వచ్చారని వివరించారు.
ఆ వ్యక్తికి గతంలో చేసిన స్క్రీనింగ్ టెస్టులో నెగిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. రెండ్రోజులుగా ఆ వ్యక్తి జలుబుతో బాధ పడుతున్నారని వివరించారు. అనుమానం వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారని కలెక్టర్ తెలిపారు. రక్త నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించామని... ప్రస్తుతానికి అనుమానిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.
అనుమానితుడు తిరిగిన ఇంటిని కూడా డొమెస్టిక్ ఐసోలేషన్‌లో పెట్టామని వివరించారు. కరోనాపై వారి బంధువులకు అవగాహన కల్పించామన్న కలెక్టర్ మురళీధర్ రెడ్డి... జిల్లా ప్రజలు భయపడుతున్నందున్న ఆ వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచుతున్నామని స్పష్టం చేశారు. అతని పేరు, ప్రాంతం వివరాలు గోప్యంగా ఉంచాలని కోరారు.
ఇదీ చదవండీ... తూర్పుగోదావరి జిల్లా వాసికి కరోనా వైరస్?