రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 నుంచి పెండింగ్లో ఉన్న డీఏలను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలని ఆ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దసరా పండగకైనా కనీసం రెండు డీఏలైనా విడుదల చేయాలని అన్నారు. కడపలోని ఏపీఎన్జీవో హోంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న సగం జీతం ఐదు విడతలుగా చెల్లించేందుకు ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని చెప్పారు. పీఆర్సీ కమిటీ కాలయాపన చేయకుండా రెండు నెలల్లో నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. 2021 జనవరి కల్లా పీఆర్సీ మంజూరయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను అందర్నీ క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం కడప జిల్లా ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడిగా రమేష్ కుమార్, సుబ్బా రెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.