కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వామపక్షాల నేతలు నిరసన చేపట్టారు. నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా.. రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలు.. అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం ద్వారా కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆయా చట్టాలను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరిస్తూ.. తహసీల్దార్ ప్రసాద్‌కు వినతి పత్రం సమర్పించారు.
కడపలో...
రైతులను నట్టేట ముంచే నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో.. నడుముకు ఆకులు కట్టుకుని కడపలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని కళాక్షేత్రం నుంచి జెడ్పీ కార్యాలయం వరకు.. చేతిలో ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెళ్లారు. వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేలా నరేంద్రమోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగదు బదిలీ, మోటర్లకు మీటర్లు తదితర పథకాల ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: