రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యకలాపాలు చేయని వైకాపా ప్రభుత్వం... అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. గత 14 నెలల్లో రాష్ట్రంలో కొత్తగా ఒక్క అభివృద్ధి ప్రాజెక్టుని మొదలు పెట్టలేదని... అదే సమయంలో గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను నిలిపివేశారని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం రివర్స్ విధానాలు రాష్ట్రాన్ని వెనక్కు నెట్టాయని వ్యాఖ్యానించారు. దీని నుంచి కోలుకోవటానికి ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేమన్నారు. స్థానిక సంస్థలకు అధికారాలు ఇవ్వటం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కొందని గుర్తు చేశారు. అభివృద్దికి చోదకశక్తి వంటి హైదరాబాద్‌ని కోల్పోవటంతో పరిశ్రమలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందిపడ్డామని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఐదేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో శ్రమించి పారిశ్రామిక పెట్టుబడులు తెచ్చిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అప్పుడు పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ రాష్ట్రంలో అందరికీ టెలీ సాంకేతికత సమకూర్చిందన్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రాష్ట్రానికి అవసరమైన వనరులను సృష్టించడానికి వీలు కల్పించాయని అభిప్రాయపడ్డారు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారని... ఐదేళ్లలోనే పోలవరం 72% పూర్తయిందని తెలిపారు. తెదేపా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుండి అవార్డులు వచ్చాయని... ఐదేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం నిజంగా అభివృద్ధి వికేంద్రీకరణ చేసిందని వివరించారు.
ఇదీ చదవండి