రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి జగన్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి ఉపాధికి గండి పడకుండా చూడాలని లేఖలో డిమాండ్ చేశారు. డీలర్లలో ఎక్కువమంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలవారే ఉన్నారని... స్వయం ఉపాధి కింద వారంతా రేషన్ సరకుల పంపిణీ బాధ్యతలు చేపడుతున్నారని వివరించారు. ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సరకులు ఇంటికి పంపిస్తే... డీలర్లకు వచ్చే కమీషన్ కోల్పోతారని లేఖలో పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఏడు విడతల రేషన్ పంపిణీ చేయగా.. కేవలం 2 విడతల కమీషన్ ఇవ్వటాన్ని కన్నా తప్పుబట్టారు. మిగతా ఐదు విడతల కమీషన్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ డీలర్లందరికీ కరోనా బీమా సౌకర్యం కల్పించాలన్నారు. బయోమెట్రిక్ విధానం రద్దు చేసి డీలర్లను కరోనా బారి నుంచి కాపాడాలని కోరారు. రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు మాధవరావు తనకు ఇచ్చిన లేఖను... ముఖ్యమంత్రికి రాసిన లేఖతో పాటు జత చేశారు.
ఇదీ చదవండి : 'నలంద కిషోర్‌ను క్షోభ పెట్టి ప్రభుత్వమే చంపేసింది'