nadendla Manohar on parchur koulu rythu bharosa sabha: కౌలు రైతుల కన్నీటి వేదనలు తెలియాలంటే పర్చూరులో తాము నిర్వహించనున్న ‘కౌలు రైతుల భరోసా సభ’కు సీఎం హాజరు కావాలని, ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈనెల 19న బాపట్ల జిల్లా పర్చూరులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించే సభకు సీఎం వస్తే కౌలు రైతులు ఎందరు ఆత్మహత్యలు చేసుకున్నారో... వారి కుటుంబాలు ఎలాంటి వేదన అనుభవిస్తున్నాయో స్వయంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు పవన్‌కల్యాణ్ రూ.5 కోట్లను ప్రత్యేక నిధికి జమచేశారు. ఈనెల 19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 76 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తాం. అనంతరం పర్చూరులో బహిరంగ సభ ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నేను సభాపతిగా ఉన్నప్పుడు భూ యజమానులతో సంబంధం లేకుండానే కౌలు రైతుకు మేలు జరిగేలా చట్టంలో కీలక అంశాలను చేర్చాం. ఆ చట్టానికి 2019లో సీఎం పూర్తిస్థాయిలో మార్పులు చేశారు. 2015లో 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అప్పటి ప్రభుత్వ లెక్కల్లో ఉంది. ఇప్పుడా సంఖ్య 16 లక్షలకు పడిపోయింది. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర బడ్జెట్‌లో కౌలు రైతులకు రూ.1.11 లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించి.. రూ.4,100 కోట్లు మాత్రమే ఇచ్చారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు గొప్ప ఆశయంతో ముందుకెళ్తున్నాం. రూ.లక్ష ఇస్తేనే మా బాధ్యత అయిపోనట్లు కాకుండా.. వారి పిల్లల విద్య, భవిష్యత్తు గురించి భరోసా కల్పించేలా కృషి చేస్తాం" అని నాదెండ్ల తెలిపారు. సమావేశంలో జనసేన నాయకులు గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, విజయ్‌కుమార్, కల్యాణ్ శ్రీనివాస్, చిల్లపల్లి శ్రీనివాస్, నయాబ్‌కమాల్, జిలానీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: