ప్రజలకు సమస్య వస్తే ప్రభుత్వం వైపు చూస్తారని...కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ప్రభుత్వమే సమస్యగా మారిందని గుంటూరు పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గుంటూరులోని తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ అధ్యక్షునిగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా అన్నాబత్తుని జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా రిజ్వానా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన శ్రావణ్... చంద్రబాబు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి, చంద్రబాబుకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.
అధికారం ఉంది కదా అని వైకాపా నేతలు తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక అందుకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు.
వైకాపా ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వైకాపాకి ఎదురుదెబ్బ తగలక తప్పదని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, ధూళ్లిపాళ్ల నరేంద్ర, మాకినేని పెదరత్తయ్య, ఎమ్మెల్సీ రామకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :