లాక్డౌన్ ప్రభావం గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్నిచోట్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎక్కడా రోడ్లపైకి వాహనాలు, ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి బయటకు వచ్చే వారిని నియంత్రిస్తున్నారు. అత్యవసర సర్వీసులకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మిగతా వారిని వెనక్కి పంపిస్తున్నారు. ఎలాంటి పని లేకుండా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చిన వాహనాలను సీజ్ చేస్తున్నారు. వాటిని లాక్ డౌన్ ముగిసే వరకూ వదలొద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆటోలు బయటకు వస్తే వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన తరుణంలో రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. అత్యవసర సర్వీసులకు సంబంధించిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి.
బాపట్ల-చీరాల రహదారిలో చెక్‌పోస్టులు
పనిలేకుండా రోడ్లపైకి వస్తున్నవారిపై పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. మాటవినని వారిపై లాఠీ ఝుళిపిస్తున్నారు. ప్రజలు మూడు వారాల పాటు ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. జిల్లాలోని బాపట్ల, చీరాల రహదారిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పట్టణంలోకి వచ్చి, వెళ్లే వారి వివరాలను సేకరిస్తున్నారు. కరోనా వ్యాప్తి నిరోధానికి పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తోందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అత్యవసరం ఉంటే కుటుంబంలో ఒకరు మాత్రమే బయటకు రావాలని సూచించారు. నిర్లక్ష్యంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.
నరసరావుపేటలో పోలీసుల లాఠీఛార్జ్
నరసరావుపేటలో కరోనా వ్యాప్తి నిర్మూలన చర్యలకు కొంత మంది ఆటంకం కల్గిస్తున్నారు. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేసి రోడ్లపై తిరుగుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులను పట్టించుకోకుండా బయటతిరుగుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కనీసం మాస్క్‌లు సైతం లేకుండా రహదారులపై తిరుగుతున్న వారికి పోలీసుల లాఠీ దెబ్బ రుచిచూపించారు. నిబంధనలు ఉల్లింఘించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలని పోలీసులకు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చదవండి: